
కారు లోపల ఉంచొద్దు.. మండు వేసవి సమయంలో నిట్ట మధ్యాహ్నం వేళ కారును బయట పార్క్ చేసారనుకోండి. ఆ కారులో ఎట్టిపరిస్థితుల్లోనూ మీ ఫోన్ వదిలేయకూడదు. ఎందుకంటే బయట వేడి వాతావరణం కారణంగా కారు బాగా వేడెక్కుతుంది. ఫలితంగా ఫోన్ కూడా బాగా వేడిగా అయ్యే ప్రమాదం ఉంది. యాపిల్ సంస్థ ప్రకటించిన దాని ప్రకారం, 35 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలో యాపిల్ ఐఫోన్ ఉంచితే దాని బ్యాటరీకి హాని కలుగుతుంది. ఆండ్రాయిడ్ ఫోన్‌లకు సంబంధించి ఎటువంటి నివేదిక లేదు. కానీ అది అదే విధమైన ప్రభావం వీటిపై కూడా ఉండే అవకాశం ఉంది.

ఫోన్‌ను డ్యాష్‌బోర్డ్‌పై ఉంచవద్దు.. మీరు కారు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఫోన్‌ను డ్యాష్‌బోర్డ్‌పై ఎట్టి పరిస్థితుల్లోనూ ఉంచవద్దు. ఎందుకంటే మీరు డ్రైవింగ్ హడావుడిలో ఉండి ఫోన్ ని పట్టించుకోరు. కానీ బయటి నుంచి అద్దాల గుండా సూర్యరశ్మి ఫోన్ పై పడి అది వేడెక్కేలా చేస్తుంది.

ఎండలో చార్జింగ్ పెట్టొద్దు.. సాధారణంగా ఫోన్లు చార్జింగ్ పెట్టేటప్పుడు వేడెక్కుతాయి. అందే ఎండలోనే పెట్టి చార్జింగ్ పెడితే ఇంకా త్వరగా ఓవర్ హీట్ అయిపోతాయి. అందుకే ఫోన్ చార్జింగ్ పెట్టేటప్పుడు నీడ ఉన్న ప్రదేశాల్లోనే పెట్టాలి.


ఫోన్ ఓవర్‌ఛార్జ్ చేయవద్దు.. చాలా మంది వినియోగదారులు రాత్రిపూట నిద్రిస్తున్నప్పుడు తమ ఫోన్‌లను ఛార్జ్ పెట్టేసి రాత్రంతా అలాగే ఉంచేస్తారు. దీని వల్ల ఫోన్ ఓవర్ హీట్ అవడంతో పాటు బ్యాటరీ కూడా బలహీన పడే అవకాశం ఉంది. ఇటీవల కాలంలో చాలా ఫోన్‌లు బ్యాటరీ విషయానికి వస్తే ఆటో కట్-ఆఫ్‌తో వచ్చినప్పటికీ, మీ ఫోన్‌ను ఓవర్ ఛార్జ్ చేయకుండా ఉండటం మంచి పద్ధతిఅలాగే, ఛార్జింగ్‌లో ఉన్నప్పుడు మీ స్మార్ట్‌ఫోన్‌లను దిండ్లు లేదా దుప్పటి కింద ఉంచకూడదు.

వేడెక్కువైతే పౌచ్ తీసేయండి.. స్మార్ట్ ఫోన్లకు పౌచ్ లను వాడటం మంచి పద్ధతి. ఇది ప్రమాదవశాత్తు ఫోన్ కింద పడిపోయినప్పుడు రక్షణగా ఉంటుంది. అయితే, మీ ఫోన్ వేడెక్కుతున్నట్లు మీకు అనిపిస్తే, కొంత సమయం పాటు కవర్ నుంచి ఫోన్ బయటకు తీయడం మంచిది.