
మనం యాక్టీవ్‌గా ఉండాలంటే మన శరీరానికి అవసరమైన పోషకాలు పుష్కలంగా అందాలి.. లేదంటే అలసట, నీరసం వంటి అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి మన రోజువారీ ఆహారంలో పోషక విలువలున్న ఆహారాలను చేర్చుకోవడం చాలా ముఖ్యం. ఇలాంటి వాటిలో పొద్దుతిరుగుడు గింజలు కూడా ఒకటి. వాటిలో విటమిన్ ఇ, విటమిన్ బి6, మెగ్నీషియం, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. వీటిని తీసుకోవడం ద్వారా మీ ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవచ్చు.

పొద్దుతిరుగుడు గింజలలో విటమిన్ బి6 ఉంటుంది. ఇది నాడీ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. అలాగే ఇందులో ఉండే ప్రోటీన్ జీవక్రియకు ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి సహాయపడుతుంది. ఈ విటమిన్ శరీరంలో శక్తి వినియోగానికి సంబంధించిన అనేక ప్రక్రియలలో కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అంతేకాదు వీటిలో విటమిన్ ఇ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది శరీర కణాలను ఆక్సీకరణ నష్టం నుండి కాపాడి.. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

మెగ్నీషియం లోపం ఉన్న వారికి ఇవి చాలా బాగా ఉపయోగపడుతాయి. ఎందుకంటే పొద్దుతిరుగుడు గింజలలో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ఇది కండరాల పనితీరు, నాడీ ఆరోగ్యం, ఎముకల బలం, శక్తి ఉత్పత్తికి చాలా అవసరం. సమతుల్య ఆహారంలో భాగంగా ఈ గింజలను తీసుకోవడం శరీరానికి మెగ్నీషియం అందించడంలో సహాయపడుతుంది.

ఈ విత్తనాలను మనం అనేక రకాలు ఆహారంలో చేర్చుకోవచ్చు.. కొందరు వీటిని పచ్చిగా తినడానికి ఇష్టపడతారు.. మరి కొందరు వెయించుకొని తింటారు. అంతేకాదు వీటిని పెరుగు, పండ్లు, సలాడ్లు, మొలకలతో కలుపుకొని కూడా తీసుకుంటారు. కొందరు వీటిని రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే తింటారు. నానబెట్టడం తప్పనిసరి కాదు; సరిగ్గా నమిలితే వీటిని భోజనంలో భాగంగా కూడా తీసుకోవచ్చు.

సాధారణంగా, రోజుకు సుమారు 20 నుండి 30 గ్రాముల పొద్దుతిరుగుడు గింజలను తీసుకోవడం సరిపోతుంది. వీటిలో కేలరీలు, కొవ్వు అధికంగా ఉంటాయి, కాబట్టి అతిగా తినడం కూడా ఆరోగ్యానికి అంత మంచిది కాదు. మొత్తమ్మీద, పొద్దుతిరుగుడు గింజలు పోషకాలకు మంచి మూలం, వీటిని మీ రోజువారీ ఆహారంలో మితంగా చేర్చుకోవచ్చు. Note: పైన పేర్కొన్న అంశాలు కేవలం ఇంటర్నెట్, నివేదికల ఆధారంగా మాత్రమే అందించబడినవి.. వీటిని Tv9 దృవీకరించడం లేదు.