
అంతర్జాతీయ చెస్ పోటీల్లో తెలంగాణ అమ్మాయి సత్తా చాటింది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా నాలుగు విభాగాల్లో పతకాలు గెల్చుకుని మువ్వన్నెల జెండాను రెపరెపలాడించింది. అలాగే అంతర్జాతీయ క్రీడా వేదికపై తెలుగు వారి క్రీడా ప్రతిభను చాటి చెప్పింది.

దుబాయ్ వేదికగా జరుగుతోన్న ఆసియా యూత్ చెస్ ఛాంపియన్ షిప్-2023 పోటీల్లో కీర్తి ఘంటా సంచలనం సృష్టించింది. హైదరాబాద్‌లోని మియాపూర్ కు చెందిన ఆమె మొత్తం నాలుగు విభాగాల్లో పతకాలు గెల్చుకుంది.

అండర్-16 బాలికల విభాగంలో పోటీ పడిన కీర్తి టీమ్ క్లాసిక్ ఈవెంట్‌లో బంగారు పతకం సాధించిన ఈ హైదరాబాదీ బ్లిట్జ్ ఈవెంట్ బాలికల విభాగంలో రజత పతకం సొంతం చేసుకుంది.

అలాగే టీమ్ ర్యాపిడ్ ఈవెంట్‌లో స్వర్ణ పతకం గెల్చుకున్న కీర్తి, స్టాండర్డ్ ఈవెంట్ పోటీల్లోనూ కాంస్య పతకం సొంతం చేసుకుంది. చిన్న వయసులోనే అంతర్జాతీయ పోటీల్లో సత్తా చాటుతున్న కీర్తిపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.

ఇక కీర్తి ఘన విజయాలను చూసి ఆమె తల్లిదండ్రులు పొంగిపోతున్నారు. చెస్ పట్ల తమ కూతురు కున్న అంకితభావానికి ఈ పతకాలు నిదర్శనమంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.