
మేషం: ఈ రాశికి శని వ్యయ స్థానంలో సంచారం చేస్తుండడం వల్ల ఏలిన్నాటి శని దోషం ఏర్పడింది. దీనివల్ల ఎంత కష్టపడ్డా పురోగతి, అభివృద్ధి ఉండవు. ప్రతి పనిలోనూ శ్రమ, తిప్పట, వ్యయ ప్రయాసలు ఎక్కువగా ఉంటాయి. రహస్య శత్రువులు తయారై కుట్రలు కుతంత్రాలు చేస్తుంటారు. ఉచ్ఛ గురువు ఈ శనిని వీక్షించడం వల్ల ఈ రాశివారికి అన్నిటా విజయాలు సిద్ధిస్తాయి. ముఖ్యంగా అనేక విధాలుగా సంపద పెరుగుతుంది. పురోగతి, అభివృద్ధికి ఏమాత్రం లోటుండదు.

సింహం:ఈ రాశికి అష్టమ రాశిలో శనీశ్వరుడి సంచారం వల్ల అష్టమ శని దోషం కలిగింది. దీనివల్ల ఏ పనీ, ఏ ప్రయత్నమూ ఒక పట్టాన సవ్యంగా పూర్తి కాదు. ముఖ్యమైన వ్యవహారాలన్నీ అసంపూర్తిగా నిలిచిపోతుంటాయి. శత్రు బాధ, పోటీదార్ల బెడద ఎక్కువగా ఉంటుంది. అనారోగ్య సమస్యలు పీడించే అవకాశం ఉంటుంది. అయితే, గురువు ఉచ్ఛస్థితిలోకి వచ్చి ఈ శనిని వీక్షించడం వల్ల విజయాలు ఎక్కువగా కలుగుతాయి. ఆర్థిక, అనారోగ్య, వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.

కన్య: ఈ రాశికి సప్తమ స్థానంలో శనీశ్వరుడి సంచారం వల్ల ప్రతి పనిలోనూ, ప్రతి ప్రయత్నంలోనూ ఆటంకాలు, అవరోధాలు ఎక్కువగా ఉంటాయి. రావలసిన డబ్బు రాక బాగా ఇబ్బంది పడతారు. శ్రమ ఎక్కువ ఫలితం తక్కువగా ఉంటుంది. పదోన్నతులు ఆగిపోతాయి. అక్టోబర్ 19న గురువు ఉచ్ఛ స్థితికి వచ్చిన దగ్గర నుంచి ఈ రాశివారికి ఈ సమస్యలన్నీతొలగిపోతాయి. పదోన్నతులు లభిస్తాయి. ఆదాయం బాగా వృద్ది చెందుతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి.

ధనుస్సు: ఈ రాశికి చతుర్థ స్థానంలో శని సంచారం వల్ల అర్ధాష్టమ శని దోషం ఏర్పడింది. దీనివల్ల మన శ్శాంతి తగ్గుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు లోపిస్తాయి. ఇంట్లో ఎవరో ఒకరు అనారోగ్యంతో బాధపడడం జరుగుతుంది. సొంత ఇంటి ప్రయత్నాలు ఒకపట్టాన ముందుకు సాగవు. ఆస్తి వివాదాలు తలెత్తుతాయి. అయితే, శని మీద ఉచ్ఛ గురువు దృష్టిపడిన తర్వాత రాజ యోగాలు, ధన యోగాలు కలుగుతాయి. అన్నిటా విజయాలు సిద్ధించి సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి.

కుంభం: ఈ రాశికి ద్వితీయ స్థానంలో శని సంచారం వల్ల ఏలిన్నాటి శని దోషం కలిగింది. దీనివల్ల ఆదా యం వృద్ధి చెందే అవకాశం ఉండదు. ఎంత కష్టపడ్డా ఆదాయం పెరగదు. రావలసిన డబ్బు చేతికి అందదు. కుటుంబంలో సుఖ సంతోషాలు లోపిస్తాయి. జరగాల్సిన శుభకార్యాలు జరగకపోవచ్చు. శని మీద గురువు దృష్టితో అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. కుటుంబంలో శుభ కార్యాలు జరుగుతాయి. ఏ ప్రయత్నం చేపట్టినా విజయవంతం అవుతుంది. ఆరోగ్యం మెరుగవుతుంది.

మీనం: ఈ రాశిలో శని సంచారం వల్ల ఏలిన్నాటి శని దోషం కలిగింది. దీనివల్ల ఇంటా బయటా ప్రాధాన్యం, ప్రాభవం బాగా తగ్గుతాయి. గతంలో సహాయం పొందినవారు ముఖంచాటేయడం జరుగుతుంది. ఒంటరి పోరాటం చేయాల్సి వస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో పురోగతి స్తంభించిపోతుంది. అక్టో బర్ 19 తర్వాత నుంచి పరిస్థితి మారిపోతుంది. సర్వత్రా ప్రాధాన్యం పెరుగుతుంది. రాజ పూజ్యాలు కలుగుతాయి. కొద్ది శ్రమతో ఆదాయం బాగా పెరుగుతుంది. వ్యక్తిగత సమస్యలు తగ్గిపోతాయి.