
కావలసిన పదార్థాలు: ఉసిరికాయలు 6, నూనె 2 టీస్పూన్లు, పచ్చి శనగపప్పు 1 టేబుల్ స్పూన్, మినప్పప్పు 1 టేబుల్ స్పూన్, మెంతులు 5, జీలకర్ర అర టేబుల్ స్పూన్, ధనియాలు 2 టేబుల్ స్పూన్లు, ఎండుమిర్చి 10, కరివేపాకు 1 రెమ్మ, ఇంగువ పావు టీస్పూన్, వెల్లుల్లి రెబ్బలు 8, ఉప్పు రుచికి సరిపడా.

ఈ కారం పొడి తయారీ కోసం ముందుగా ఆరు మీడియం సైజు ఉసిరికాయలను శుభ్రంగా కడిగి, తడి లేకుండా తుడవాలి. ఆ తర్వాత గింజలను వేరు చేస్తూ ఉసిరికాయలను సన్నగా తురుముకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి ఒక టీస్పూన్ నూనె వేసి వేడి చేయాలి. అందులో ఉసిరికాయ తురుమును వేసి, సన్నని మంటపై లేత బంగారు రంగులోకి మారి పచ్చిదనం పోయేంత వరకు కలుపుతూ వేయించాలి. ఇలా వేయించడం వల్ల పొడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. వేగిన తురుమును ఒక ప్లేట్‌లోకి తీసుకుని చల్లారనివ్వాలి.

అదే పాన్‌లో మరో టీస్పూన్ నూనె వేసి పచ్చి శనగపప్పు, మినప్పప్పు, ఐదారు మెంతులు, జీలకర్ర, ధనియాలు వేసి సన్నని మంటపై దోరగా వేయించాలి. పప్పులు చక్కగా వేగిన తర్వాత పది ఎండుమిర్చి, ఒక రెమ్మ కరివేపాకు వేసి కరకరలాడే వరకు వేయించుకోవాలి. చివరగా పావు టీస్పూన్ ఇంగువ వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి. వేయించిన ఈ పప్పుల మిశ్రమాన్ని కూడా ప్లేట్‌లోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి.

ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ముందుగా పప్పులు, ఎండుమిర్చి మిశ్రమాన్ని మిక్సీ జార్‌లో వేసి మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత వేయించి చల్లార్చిన ఉసిరికాయ తురుము, ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా ఉప్పు వేసి మరోసారి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి.

ఎంతో కమ్మగా, ఘుమఘుమలాడే ఈ ఉసిరికాయ కారం పొడిని గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకుంటే చాలా రోజుల పాటు తాజాగా ఉంటుంది. వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని ఈ పొడి కలుపుకుని తిన్నా లేదా ఇడ్లీ, దోసెలతో ఆరగించినా రుచి అమోఘంగా ఉంటుంది.