
ఈ రవ్వ లడ్డు తయారీలో అతి ముఖ్యమైన సీక్రెట్ స్టెప్ రవ్వను నానబెట్టడం. ముందుగా ఒక బౌల్‌లో ఒక కప్పు (250 గ్రాములు) బొంబాయి రవ్వ తీసుకుని, అందులో అర కప్పు తాజా పచ్చి కొబ్బరి తురుము వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కనీసం 2 గంటల పాటు అలాగే వదిలేయాలి.

ఇలా చేయడం వల్ల కొబ్బరిలోని తడంతా రవ్వ పీల్చుకుని, రవ్వ వేపేటప్పుడు కొబ్బరి పాల రుచిని అందించి అద్భుతమైన టేస్ట్‌ను ఇస్తుంది. ఈ దశను అసలు స్కిప్ చేయకూడదు. రవ్వ నానిన తర్వాత పాన్‌లో 50 గ్రాముల నెయ్యి వేడిచేసి కాసిన్ని జీడిపప్పు, కిస్మిస్‌లను దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి.

అదే నేతిలో రెండు గంటలు నానబెట్టుకున్న రవ్వ-కొబ్బరి మిశ్రమాన్ని వేసి సన్నటి మంటపై కమ్మటి సువాసన వచ్చే వరకు వేయించాలి. రవ్వ వేగడానికి సుమారు 20 నుండి 25 నిమిషాలు పడుతుంది. రవ్వ ఎంత బాగా వేగితే లడ్డు అంత రుచిగా వస్తుంది. రవ్వ వేగిన తర్వాత జీడిపప్పు, కిస్మిస్‌లు వేసి కలపాలి.

మరో కడాయిలో ముప్పావు కప్పు పంచదార, 100 ml నీళ్లు పోసి తీగ పాకం వచ్చేంత వరకు మరిగించాలి. ఒక తీగ పాకం రాగానే స్టవ్ ఆఫ్ చేసి, వేయించి పెట్టుకున్న రవ్వ మిశ్రమాన్ని అందులో పోసి బాగా కలపాలి. మిశ్రమం గోరువెచ్చగా అయ్యేంత వరకు చల్లారనివ్వాలి.

పూర్తిగా చల్లారిన తర్వాత అందులో ఒక టీస్పూన్ యాలకుల పొడి వేసి బాగా మెదిపి, చిన్న చిన్న లడ్డులుగా చుట్టుకోవాలి. నోట్లో వేస్తే కరిగిపోయే ఈ రవ్వ లడ్డులను ఎయిర్ టైట్ డబ్బాలో నిల్వ చేసుకుంటే రోజుల తరబడి తాజాగా ఉంటాయి.