
కావలసిన పదార్థాలు: రాగి పూరీల కోసం: 1 కప్పు రాగి పిండి, 1 కప్పు గోధుమ పిండి, పావు టీస్పూన్ పంచదార, రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కాచిన వేడి నూనె, పిండి కలపడానికి తగినన్ని నీళ్లు, డీప్ ఫ్రైకి సరిపడా వంట నూనె, బొంబాయి చట్నీ కోసం: 2 టేబుల్ స్పూన్ల శనగపిండి, 1½ కప్పుల నీళ్లు, మీడియం సైజు 2 సన్నని పొడవాటి ముక్కలు ఉల్లిపాయలు , 4 నుండి 5 పచ్చిమిరపకాయలు చీలికలు, అర టీస్పూన్ అల్లం తరుగు, అర టీస్పూన్ ఆవాలు, అర టీస్పూన్ జీలకర్ర, ఒక్కొక్క టీస్పూన్ శనగపప్పు, మినప్పప్పు, పావు టీస్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర, అర చెక్క నిమ్మరసం రసం, 1 టేబుల్ స్పూన్ వంట నూనె

తయారీ విధానం: ఒక వెడల్పాటి మిక్సింగ్ బౌల్లో 1 కప్పు రాగిపిండి, 1 కప్పు గోధుమపిండి వేయాలి. ఇందులో పావు టీస్పూన్ పంచదార, సరిపడా ఉప్పు మరియు 1 టేబుల్ స్పూన్ వేడి నూనె వేసి చేత్తో బాగా కలపాలి. ఇప్పుడు కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ పూరీ పిండిలా కాస్త గట్టిగా, మృదువుగా కలుపుకోవాలి (పిండి మరీ లూజ్ అయితే నూనె పీలుస్తుంది). పైనుంచి అర టీస్పూన్ నూనె రాసి మూతపెట్టి 10 నిమిషాలు నాననివ్వాలి.

క్విక్ బొంబాయి చట్నీ తయారీ: ఒక చిన్న గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల శనగపిండి వేసి, అర కప్పు నీళ్లు పోసి ఉండలు లేకుండా జారుడుగా కలిపి పక్కన పెట్టుకోవాలి. స్టవ్‌పై పాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ నూనె వేడిచేసి ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, కరివేపాకు వేసి వేయించాలి. పోపు వేగాక అల్లం తరుగు, పచ్చిమిర్చి చీలికలు, పొడవుగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి ఉల్లిపాయ మెత్తబడే వరకు వేపాలి. ఇప్పుడు పావు టీస్పూన్ పసుపు, సరిపడా ఉప్పు, 1 కప్పు నీళ్లు పోసి మరగనివ్వాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు కలిపి ఉంచుకున్న శనగపిండి మిశ్రమాన్ని పోస్తూ గరిటెతో కలపాలి. మీడియం మంటపై 2-3 నిమిషాలు ఉడికించి చిక్కబడ్డాక కొత్తిమీర, నిమ్మరసం పిండి స్టవ్ ఆఫ్ చేయాలి.

పూరీలు ఒత్తుకోవడం & వేయించడం: నానిన పిండిని సమాన పరిమాణంలో చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. పూరీపీటపై కొద్దిగా పొడి గోధుమపిండి చల్లి లేదా నూనె రాసి.. పూరీలను మరీ పల్చగా కాకుండా కాస్త మందంగా రౌండ్‌గా ఒత్తుకోవాలి.

కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి బాగా వేడిచేయాలి. పొగలు వచ్చే వేడి నూనెలో పూరీని వేసి.. జల్లి గరిటెతో పైనుంచి సున్నితంగా నొక్కితే పూరీ బంతిలా పొంగుతుంది. వెంటనే రెండో వైపుకు తిప్పి కొన్ని సెకన్లు వేయించి ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే, నోరూరించే సాఫ్ట్ అండ్ ఫ్లఫీ 'రాగి పూరీలు' సిద్ధం! వేడివేడి పూరీలను కమ్మటి బొంబాయి చట్నీతో ముంచుకుని తింటుంటే నూనె జిడ్డు ఏమాత్రం లేకుండా, నోట్లో వెన్నలా కరిగిపోతూ సంపూర్ణ పోషకాలను అందిస్తాయి!