
సమ్మర్‌లో బాడీని కూల్ చేయడంలో దోసకాయ చాలా బాగా పనిచేస్తుంది. ఎందుకంటే దోసకాయలో 95 శాతం నీరు ఉంటుంది. ఇది శరీరంలో నీటి శాతాన్ని క్రమబద్ధీకరించి, డీహైడ్రేషన్ నుండి కాపాడుతుంది. దీనిలో సహజంగానే శరీరాన్ని చల్లబరిచే గుణం ఉంటుంది. వేసవిలో ఇది కడుపుని చల్లగా ఉంచుతుంది. అయితే దోసకాయ తినే విషయంలో చాలా మందికి ఉండే డౌట్ ఏమిటంటే దీన్ని తొక్క తీసి తినాల లేదా అలాగే తినాలా అని.

పోషక నిపుణుల ప్రకారం దోసకాయను తొక్కతో సహా తినడమే ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుందట. తొక్కలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది తిన్నప్పుడు కడుపు నిండుగా ఉన్న అనుభూతిని కలిగిస్తుంది, తద్వారా అతిగా తినడాన్ని తగ్గిస్తుంది.

అలాగే తొక్కలో బీటా-కెరోటిన్, విటమిన్ కె సమృద్ధిగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడానికి, ఎముకలను దృఢంగా ఉంచడానికి సహాయపడతాయి. తొక్కలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు సూర్యుని హానికరమైన కిరణాల నుండి చర్మాన్ని రక్షిస్తాయి.

అయితే, మార్కెట్లో లభించే దోసకాయల మీద క్రిమిసంహారక మందులు చల్లుతుంటారు. కాబట్టి దోసకాయను తినే ముందు వాటిని ఉప్పు నీటితో బాగా కడగాలి. కెమికల్స్ లేదా ఇతర రసాయనాలు పోవాలని భావించే వారు తొక్క తీసి తినవచ్చు.

కానీ సహజంగా పండిన వాటిని తొక్కతో తింటేనే పూర్తి పోషకాలు అందుతాయి. దోసకాయ సలాడ్ రూపంలో, కొంచెం ఉప్పు లేదా మసాలా చల్లుకుని తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యం కూడా చాలా మంచిది.