చరిత్రాత్మక ఘట్టానికి సమయం ఆసన్నమైంది. తొలిసారి తెలుగు అమ్మాయి రోదసిలోకి ప్రవేశించబోతున్నారు. మరికొద్ది గంటల్లో ఈ అద్భుత దృశ్యం ఆవిష్కృతం కానుంది.
ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాకు చెందిన బండ్ల శిరీష.. తొలిసారి అంతరిక్షంలో ప్రవేశించబోతున్నారు.
ప్రముఖ అంతరిక్ష సంస్థ వర్జిన్ గెలాక్టిక్ ఆదివారం నాడు మానవ సహిత వ్యోమనౌక వీఎస్‌ఎస్ యూనిటీ-22ను ప్రయోగిస్తోంది.
ఈ వీఎస్ఎస్ యూనిటీ-22 ని వీఎంఎస్ ఈవ్ అనే ప్రత్యేక విమానం భూమి నుంచి 15,000 మీటర్ల ఎత్తుకు తీసుకెళుతుంది. అక్కడి నుంచి రాకెట్ ప్రజ్వలనంతో యూనిటీ-22 మరింత ఎత్తుకు వెళుతుంది.
ఫ్లోరిడా విశ్వవిద్యాలయం రూపొందించిన ఈ ప్రయోగంలో భాగంగా వ్యోమనౌకలో మానవ తీరుతెన్నులకు సంబంధించి అధ్యయనం చేయనున్నారు.
ఫ్లోరిడా విశ్వవిద్యాలయం రూపొందించిన ఈ ప్రయోగంలో భాగంగా వ్యోమనౌకలో మానవ తీరుతెన్నులకు సంబంధించి అధ్యయనం చేయనున్నారు.
ఈ యాత్ర విజయవంతమైతే భారత్ నుంచి అంతరిక్షానికి వెళ్లిన నాలుగో వ్యోమగామిగా శిరీష చరిత్ర పుటలకు ఎక్కనున్నారు. శిరీషకు ముందు రాకేశ్ శర్మ, కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్ రోదసిలోకి వెళ్లి వచ్చారు.
ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో జన్మించిన బండ్ల శిరీష తల్లిదండ్రులతోపాటు అమెరికాలోని హ్యూస్టన్‌లో స్థిరపడ్డారు. ప్రస్తుతం ఆమె వర్జిన్ గెలాక్టిక్‌లో ప్రభుత్వ వ్యవహారాలు, పరిశోధన కార్యకలాపాల విభాగానికి ఉపాధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు.
‘‘అంతరిక్షయానాన్ని అందరికీ అందుబాటులోకి తేవాలన్న లక్ష్యంతో పనిచేస్తున్న కంపెనీలో, యూనిటీ-22 సిబ్బందిలో భాగం అవడాన్ని అత్యంత అదృష్టంగా భావిస్తున్నాను’’ అని శిరీష ట్వీట్ చేశారు.