
చలికాలం వచ్చిందంటే చాలు చర్మం పొడిబారడం, తెల్లగా మారిపోవడం సహజం. అలాగే గాలిలోని కాలుష్యం, దుమ్ము, ధూళి చర్మంపై చేరి మొటిమలు, ముఖం నల్లగా మారడానికి కారణం అవుతాయి. ఇలాంటప్పుడు ఖరీదైన బ్యూటీ ప్రోడక్ట్స్ కాకుండా చర్మానికి తేమను, మృదుత్వాన్ని అందించే కొబ్బరి నూనెతో పాటు వంటింట్లో సులభంగా లభించే కొన్ని పదార్థాలను వాడి మచ్చలను తగ్గించుకోవడంతో పాటు చర్మానికి సహజ కాంతిని పొందవచ్చు.

కొబ్బరి నూనె, కలబంద జెల్: కొబ్బరి నూనెతో చర్మ సౌందర్యాన్ని కాపాడుకునేందుకు, ఒక టీస్పూన్ కొబ్బరి నూనెలో అంతే పరిమాణంలో స్వచ్ఛమైన కలబంద జెల్ వేసి బాగా కలపాలి. తర్వాత ముఖాన్ని శుభ్రంగా కడుక్కుని మచ్చలు ఉన్న చోట, ముఖం అంతటా సున్నితంగా రాయాలి. 20–30 నిమిషాల తర్వాత ముఖాన్ని శుభ్రంగా కడిగేయవచ్చు. ఇది చర్మానికి చల్లదనాన్ని, తేమను అందించడంలో సహాయపడుతుంది.

కొబ్బరి నూనె, కస్తూరి పసుపు: నల్ల మచ్చలు పోగొట్టేందుకు మరో చిట్కా.. కొబ్బరి నూనె, పసుపు. కొద్దిగా కొబ్బరి నూనెలో చిటికెడు కస్తూరి పసుపు వేసి పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. ఆ పేస్ట్‌ను నల్లటి మచ్చలు ఉన్న చోట మాత్రమే రాసి 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో లేదా సాధారణ నీటితో కడిగేయాలి.

కొబ్బరి నూనె, తేనె: ఒక టీస్పూన్ కొబ్బరి నూనెలో అర టీస్పూన్ తేనె వేసి బాగా కలిపి ముఖానికి అప్లై చేసుకోవాలి. పొడి చర్మం ఉన్నవారికి ఇది మంచి మాయిశ్చరైజర్‌గా పనిచేసి చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. అయితే ఇక్కడో విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఏ పదార్థాన్ని ఉపయోగించినా అలర్జీ ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. ఇందుకోసం ముందుగా ప్యాచ్ టెస్ట్ చేసిన తర్వాతే ఇలాంటి వాటిని ముఖానికి రాసుకోవాలి.

ముందు జాగ్రత్తలు: అయితే జిడ్డు చర్మం లేదా మొటిమలు వచ్చే తత్వం ఉన్నవారు కొబ్బరి నూనెను ఎక్కువగా వాడటం వల్ల చర్మ రంధ్రాలు మూసుకుపోయే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి చర్మం ఉన్నవారు కొబ్బరి నూనెను తక్కువగా వాడటం మంచిది. మచ్చలు క్రమంగా తగ్గాలంటే నిరంతర శ్రద్ధ అవసరం. పగటిపూట ఎండలోకి వెళ్లేటప్పుడు సన్‌స్క్రీన్ ఉపయోగించడం వల్ల కొత్తగా నల్లటి మచ్చలు ఏర్పడకుండా నివారించవచ్చు. Note: పైన పేర్కొన్న అంశాలు ఇంటర్నెట్ లేదా నివేదికల ఆధారంగా మాత్రమే అందించబడినవి. వీటిని Tv9 ధృవీకరించడం లేదు.