
గంధంలో ఉండే సహజ బ్లీచింగ్ గుణాలు నల్ల మచ్చలు, పిగ్మెంటేషన్, మొటిమల మచ్చలను తగ్గించి, చర్మం రంగును మెరుగుపరుస్తాయి. యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టంతో పోరాడి, చర్మ ముడతలు, సన్నని గీతలు రాకుండా నివారిస్తాయి. పొడి చర్మానికి తేమను అందించి, మృదువుగా ఉంచుతుంది.

గంధం, పసుపు, పాలు ప్యాక్ తయారు చేసుకోవచ్చు. ఇందుకోసం ఒక టేబుల్ స్పూన్ చందనం, చిటికెడు పసుపు, తగినన్ని పచ్చి పాలు తీసుకోవాలి. అన్నింటినీ కలిపి పేస్టులా చేయాలి. ఈ పేస్ట్‌ను ముఖానికి, మెడకు అప్లై చేసి 15-20 నిమిషాలు ఆరనివ్వండి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో సున్నితంగా మసాజ్ చేస్తూ కడిగేయండి. ఇది నల్ల మచ్చలను తగ్గించి, చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది. పసుపులోని యాంటీబ్యాక్టీరియల్ గుణాలు మొటిమలను నివారిస్తాయి.

మరో పద్ధతిలో చందనం, నిమ్మరసం, కొబ్బరి నూనెతో కూడా ఫేస్ తయారు చేసుకోవచ్చు. దీనికోసం ఒక టేబుల్ స్పూన్ చందనం, కొన్ని చుక్కలు నిమ్మరసం, అర టీ స్పూన్ కొబ్బరి నూనె తీసుకోవాలి. అన్నింటినీ కలిపి పేస్ట్ చేయండి. ముఖానికి పట్టించి, మసాజ్ చేసి రాత్రంతా అలాగే ఉంచి ఉదయాన్నే గోరువెచ్చని నీటితో కడిగేయండి. నిమ్మరసం సహజ బ్లీచింగ్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. కొబ్బరి నూనె చర్మాన్ని తేమగా ఉంచి మచ్చల్ని తగ్గించడంలో సాయపడుతుంది. టాన్‌ను కూడా తగ్గిస్తుంది.

చందనం, ముల్తానీ మట్టి, టమాటా రసంతో కూడా ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవచ్చు. ఇందులో కావాల్సిన పదార్థాలు చందనం పొడి - అర టీ స్పూన్, ముల్తానీ మట్టి - అర టీ స్పూన్, టమాట రసం - తగినంత తీసుకోవాలి. వీటన్నింటినీ బాగా కలిపి చిక్కటి పేస్ట్ తయారు చేసుకోవాలి. ఆ తర్వాత పేస్టుని ముఖానికి పట్టించి 15 నిమిషాల పాటు అలాగే ఉంచండి. ఆ తర్వాత శుభ్రమైన నీటితో కడిగేయండి. జిడ్డు చర్మం ఉన్నవారికి ఈ ఫేస్ ప్యాక్ మంచి ఆప్షన్. అదనపు నూనెను గ్రహించి, చర్మాన్ని మెరిసేలా చేస్తుంది.

చందనం, బార్లీ, పెరుగుతో కూడా ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవచ్చు. ఇందుకోసం కావాల్సిన పదార్థాలు, చందనం పొడి - ఒక టేబుల్ స్పూన్, బార్లీ పిండి - ఒక టేబుల్ స్పూన్, పుల్లటి పెరుగు - తగినంత తీసుకోవాలి. ఈ మూడు పదార్థాలను కలిపి మెత్తటి పేస్ట్ చేయండి. ముఖంపై మచ్చలు ఉన్న చోట అప్లై చేసి 20-30 నిమిషాలు ఆరనివ్వండి. తర్వాత చల్లటి నీటితో కడిగేయండి. బార్లీలోని గుణాలు మచ్చలను తగ్గించడంలో సాయపడతాయి. పెరుగు చర్మాన్ని తేమగా ఉంచి శుభ్రపరుస్తుంది.