
ప్రశాంతమైన నిద్ర, ఒత్తిడి నివారణ: నేటి హడావుడి జీవితంలో అనిద్ర, ఒత్తిడి సర్వసాధారణమయ్యాయి. కుంకుమపువ్వులో ఉండే సాఫ్రనాల్, క్రోసిన్ అనే సమ్మేళనాలు మెదడులో సెరోటోనిన్ స్థాయిలను పెంచి మనస్సును ప్రశాంతపరుస్తాయి. నిద్రపోయే ముందు ఈ పాలు తాగడం వల్ల హాయిగా నిద్ర పడుతుంది.

రోగనిరోధక శక్తి పెంపు: కుంకుమపువ్వులో విటమిన్ సీ, మాంగనీస్, ఐరన్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని రోగనిరోధక వ్యవస్థను బలపరిచి, తరచూ వచ్చే జలుబు, దగ్గు, ఇన్ఫెక్షన్ల నుండి ఉపశమనం కలిగిస్తాయి.

మెరుగైన గుండె ఆరోగ్యం, రక్తప్రసరణ: కుంకుమపువ్వులో లభించే ఆంటియాక్సిడెంట్లు రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ చేరకుండా నిరోధిస్తాయి. ఇది రక్తపోటును క్రమబద్ధీకరించి, గుండెజబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. శరీరంలో రక్తప్రసరణను మెరుగుపరచడంలో ఇది ఎంతగానో తోడ్పడుతుంది.

చర్మ సౌందర్యం, కాంతి: కుంకుమపువ్వు పాలు తాగడం వల్ల రక్తంలో ఉన్న వ్యర్థాలు తొలిగిపోతాయి. దీనివల్ల చర్మం లోపలి నుండి శుభ్రపడి, సహజమైన కాంతితో మెరుస్తుంది. ముఖంపై ఉండే మచ్చలు, మొటిమల మచ్చలు తగ్గడానికి ఇది సహాయపడుతుంది. మహిళల్లో నెలసరి సమయంలో వచ్చే తీవ్రమైన కడుపునొప్పి, కండరాల పట్టేయడం వంటి సమస్యల నుండి కుంకుమపువ్వు పాలు మంచి ఉపశమనాన్ని ఇస్తాయి.

జీర్ణక్రియ సమర్థత,జ్ఞాపకశక్తి: ఆకలి మందగించడం, గ్యాస్ లేదా కడుపుబ్బరం ఉన్నవారు ఈ పాలు తాగితే జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. అలాగే, ఇది మెదడు పనితీరును వేగవంతం చేసి జ్ఞాపకశక్తిని పెంచడానికి ఎంతో దోహదపడుతుంది.

ఎలా తీసుకోవాలి?: ఒక కప్పు పాలలో 3 నుండి 4 కుంకుమపువ్వు రేకులను వేసి సన్నని మంటపై బాగా మరిగించాలి. పాలు కాస్త పసుపు రంగులోకి మారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి, గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగితే పూర్తి ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి.