
మండు వేసవిలో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటిపోవడంతో బాడీని చల్లబరుచుకోవడానికి ప్రతి ఒక్కరూ రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఎండ తీవ్రత వల్ల ఒంట్లో నీటి శాతం తగ్గిపోవడం, డీహైడ్రేషన్ మరియు వడదెబ్బ తగలడం వంటి సమస్యలు ఎదురవుతాయి. ఈ కాలంలో మన శరీరాన్ని సహజంగా చల్లబరచడానికి మరియు హైడ్రేటెడ్‌గా ఉంచడానికి ‘సబ్జా గింజలు’ (Sabja Seeds) ఒక అద్భుతమైన అమృతంలా పనిచేస్తాయి.

అయితే, సబ్జా గింజలను ఎలా పడితే అలా తీసుకుంటే లాభాల కంటే అనర్థాలు ఎక్కువని హెచ్చరిస్తున్నారు ప్రముఖ నేచురోపతీ వైద్యులు డాక్టర్ షగుఫ్తా గారు. చాలా మంది సబ్జా గింజలను సరిగ్గా నానబెట్టకుండానే లేదా తక్కువ సమయంలోనే నేరుగా తీసుకుంటారు. ఇలా చేయడం వల్ల అవి కడుపులోకి వెళ్లాక అక్కడి నీటిని పీల్చుకుని జీర్ణకోశ ఇబ్బందులను కలిగిస్తాయి. కాబట్టి వీటిని కనీసం 15 నుండి 20 నిమిషాల పాటు బాగా నానబెట్టిన తర్వాతే వాడాలి.

అలాగే, శ్వాసకోశ సమస్యలు, ఆస్తమా, తీవ్రమైన సైనస్ లేదా కఫం వంటి సమస్యలతో బాధపడేవారు సబ్జా గింజలను ఎక్కువగా తీసుకోకూడదు. ఎందుకంటే ఇవి అమితమైన చలవను కలిగి ఉండటం వల్ల వారిలో జలుబు లేదా శ్వాస ఇబ్బందులు మరింత పెరిగే ప్రమాదం ఉంది. గర్భవతులు కూడా వీటిని వైద్యుల సలహా మేరకే పరిమితంగా తీసుకోవాలి.

సబ్జా గింజలు శరీరానికి అమితమైన చలవను ఇస్తాయి. వీటిని నీటిలో నానబెట్టినప్పుడు ఇవి జిగురులా మారి, తమ పరిమాణం కంటే పెద్దవిగా అవుతాయి. సబ్జా గింజల్లో పీచు పదార్థం (ఫైబర్), ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, మరియు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర ఉష్ణోగ్రతను అదుపులో ఉంచడమే కాకుండా, వేసవిలో వచ్చే గ్యాస్ట్రిక్, ఎసిడిటీ, బ్లోటింగ్ మరియు మలబద్ధకం వంటి జీర్ణక్రియ సమస్యలను క్షణాల్లో దూరం చేస్తాయి. బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఇది ఒక మంచి ఔషధంలా పనిచేస్తుంది.

సమ్మర్ కోసం మరికొన్ని అమూల్యమైన చిట్కాలను పంచుకున్నారు. మనలో చాలా మంది ఎండలో తిరిగి రాగానే ఒక్కసారిగా 300 నుండి 400 ml నీటిని గటగటా తాగేస్తుంటారు. ఇలా చేయడం చాలా తప్పు. ఒకేసారి ఎక్కువ నీరు తాగడం వల్ల శరీరంలోని ముఖ్యమైన వైటల్ సాల్ట్స్ (లవణాలు) యూరిన్ రూపంలో బయటకు వెళ్ళిపోతాయి. అందువల్ల నీటిని ఎప్పుడూ కొద్దికొద్దిగా, సిప్ చేస్తూ మాత్రమే తాగాలి.