
రోహిణి ఎండకు రోళ్లు పగులుతాయి, రోహిణి వానకు రైతు ఏడుస్తాడు.. అనే నానుడి ఉంది. అందుకే రోహిణి కార్తెలో చాలా వరకు వర్షం పడకపోవడమే మంచిదంట. లేకపోతే అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు నిపుణులు. రోహిణి కార్తెలోనే వర్షాలు పడితే ఇది వ్యవసాయం పై తీవ్ర ప్రభావం చూపుతుందంట. చాలా వరకు రోహిణిలో ఎప్పుడూ కూడా ఎక్కువగా వర్షాలు పడవు, మృగశిరకార్తె ముందు మబ్బులు మొత్తం మేఘాలతో నిండిపోయి, చిన్న చిరుజల్లులు మొదలు అవుతాయి. తర్వాత ఆరుద్ర కార్తెలో విపరీతంగా వర్షాలు పడుతాయి.

ఇక రోహిణిలో ఎంత ఎక్కువగా ఎండలు కొడితే, తర్వాత అంత విస్తారంగా వర్షాలు పడతాయంట. ముఖ్యంగా రోహిణి కార్తెలో ఎండ ఎక్కువగా కొట్టడం వలన భూమి బాగా వేడిగా మారి అందులోని క్రిమి, కీటకాలు చనిపోతాయి. అయితే ఈ సమయంలో వర్షం పడటం వలన భూమి సరిగా కాలదు, దీని వలన తర్వాత పంట వేసే క్రమంలో చీడ పీడలు ఎక్కువగా వస్తాయంట.

అంతే కాకుండా రోహిణి కార్తెలో వర్షాలు పడటం వలన చాలా మంది రైతులు పొలం పనులు కూడా ప్రారంభిస్తారు, మృగశిర కార్తెలోపు విత్తనాలు పెట్టేస్తారు. దీంతో మొలకెత్తిన విత్తనాలు ఎండి పోవడం, భూమిలోనే కుళ్లిపోవడం జరుగుతుందంట. అంతే కాకుండా రోహిణి కార్తెలో వర్షం వలన పంటలకు ముఖ్యంగా మిరప , పత్తి చేను పంటలకు కాయ తొలిచే పురుగు, తెగులు, ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే? రోహిణిలో ఎండలతో భూమి బాగా కాలిపోయి అందులో ఉండే పంటకు హానిచేసే క్రిములు చనిపోతాయి. కానీ రోహిణిలో వర్షం పడటం వలన అవి చనిపోయే ఛాన్స్ చాలా తక్కువ.

అంతే కాకుండా రోహిణి కార్తెలో ఎంత ఎక్కువగా ఎండ కొడితే మృగశిర కార్తెలో అంత ఎక్కువగా వర్షాలు పడతాయి అని చెబుతుంటారు పెద్ద వారు. మృగశిరలో వర్షాలు ఎక్కువగా పడటం వలన పంటలు బాగా పండుతాయి. ముఖ్యంగా మృగశిరంకు వాన పడితే ముంగిళ్లు నిండుతాయి అంటారు. అలాగే రోహిణి కార్తెకు ఎండ ఎక్కువగా ఉండాలి, మృగశిరంకు వర్షం పడాలని చెబుతున్నారు నిపుణులు.

నోట్ : పై సమాచారం కేవలం ఇంటర్నెట్ ఆధారంగా మాత్రమే ఇవ్వడం జరిగింది. టీవీ9 తెలుగ దీనిని ధృవీకరించలేదని పాఠకులు గమనించాలి. ఇది కేవలం పాఠకుల ఆసక్తి మేరకు మాత్రమే ఇవ్వడం జరిగింది.