
వారాంతంలో కుటుంబ సభ్యుల కోసం లేదా ఇంటికి విచ్చేసిన అతిథుల కోసం స్పెషల్ నాన్-వెజ్ స్టార్టర్ వండాలనుకుంటే 'చిల్లీ చికెన్ చాప్స్' ఒక అద్భుతమైన ఎంపిక. న్యూయార్క్‌లోని ప్రసిద్ధ చట్నీ రెస్టారెంట్ షెఫ్ రెగీ మాథ్యూస్ శైలిలో రూపొందించిన ఈ ప్రత్యేకమైన చికెన్ చాప్స్ సాధారణ చికెన్ వేపుళ్ల కంటే ఎంతో భిన్నమైన ఫ్లేవర్‌ను ఇస్తుంది.

పొడి చేసిన కరివేపాకు, కొత్తిమీర, పుదీనా సువాసనలు చికెన్ ముక్కలకు పట్టి, స్మోకీ టచ్‌తో అమృతతుల్యంగా ఉంటాయి. ఆప్పం, రోటీలు, ఫ్లేవర్డ్ రైస్ లేదా స్నాక్‌గా తినడానికి ఇది పర్‌ఫెక్ట్ డిష్. ఈ చిల్లీ చికెన్ చాప్స్ తయారీకి ముందుగా అర కిలో బోన్‌లెస్ చికెన్ ముక్కలను తీసుకుని, అందులో సరిపడా ఉప్పు, అర టేబుల్ స్పూన్ కారం, పావు టీస్పూన్ పసుపు, టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేసి బాగా కలిపి కనీసం ఒక గంట పాటు ఊరబెట్టాలి.

ఇప్పుడు డ్రై రోస్ట్ పొడి కోసం కడాయిలో 2-3 రెబ్బల కరివేపాకు, 1/3 కప్పు కొత్తిమీర, గుప్పెడు పుదీనా ఆకులు వేసి తేమ ఆరే వరకు వేయించి, రోట్లో లేదా మిక్సీలో పొడి చేసుకోవాలి. బాండీలో 4-5 స్పూన్ల నూనె వేడిచేసి, మ్యారినేట్ చేసిన చికెన్ ముక్కలను వేసి హై ఫ్లేమ్‌పై 15-20 నిమిషాలు దోరగా రోస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి.

మరో పాన్‌లో 4-5 టేబుల్ స్పూన్ల నూనె వేసి పావు టీస్పూన్ సోంపు, సన్నని అల్లం తరుగు, వెల్లుల్లి తరుగు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి ఎర్రగా వేగాక ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి మరియు అర కప్పు చిలికిన పెరుగు వేసి బాగా కలపాలి.

అందులో రోస్ట్ చేసిన చికెన్ ముక్కలను వేసి హై ఫ్లేమ్‌పై టాస్ చేయాలి. చికెన్ గ్రేవీని పీల్చుకున్న తర్వాత ముందుగా పొడి చేసి పెట్టుకున్న కరివేపాకు-కొత్తిమీర పొడి చల్లి 30 సెకన్లు టాస్ చేసి దింపేస్తే ఘుమఘుమలాడే చిల్లీ చికెన్ చాప్స్ సిద్ధమవుతుంది.