
హడావిడిగా వంట చేసేటప్పుడు వంటకాల్లో అనుకోకుండా నూనె ఎక్కువగా పడిపోతుంటుంది. అధిక నూనె కూరగాయల రుచిని పాడు చేయడమే కాకుండా ఆరోగ్య సమస్యలను కూడా కలిగిస్తుంది. అయితే కిచెన్‌లోని కొన్ని పదార్ధాలతో వంటల్లో ఈ అదనపు నూనెను తేలికగా తగ్గించవచ్చు.

ఐస్ సహాయంతో నూనెను తగ్గించవచ్చు. మీరు వండిన వంటకాల్లో నూనె ఎక్కువగా ఉంటే.. ఒక పెద్ద చెంచాలో లేదా గరిటెలో 2-3 ఐస్ క్యూబ్స్ తీసుకుని.. గరిటె అడుగు భాగాన్ని కూరగాయల పై పొరపై దొర్లించాలి. చల్లని గరిటెను తాకగానే నూనె పొర గడ్డకట్టడం మొదలై గరిటెకు అంటుకుంటుంది. ఆ తర్వాత దానిని సులభంగా తొలగించవచ్చు.

ఒకవేళ కూరలు మరీ నూనెగా ఉన్నట్లు మీకు అనిపిస్తే వాటి పై పొరపై ఒక టిష్యూ పేపర్‌ను తేలికగా ఉంచండి. ఆ కాగితం వెంటనే నూనెను పీల్చుకుంటుంది. ఒకవేళ మీ దగ్గర టిష్యూ పేపర్ లేకపోతే, వంటల మీద ఒక చిన్న బ్రెడ్ ముక్కను కొన్ని సెకన్ల పాటు ఉంచండి. అది అదనపు నూనెను పూర్తిగా పీల్చుకుంటుంది.

బంగాళదుంపను ముక్కలుగా కోసి కూరలో కలపవచ్చు. బంగాళదుంపలు అదనపు నూనెను పీల్చుకునేలా దానిని 2-3 నిమిషాల పాటు తక్కువ మంట మీద ఉడికించండి. అలాగే కూర పొడిగా ఉంటే, అందులో కొద్దిగా వేయించిన శనగపిండిని కలపాలి. శనగపిండి నూనెను పీల్చుకోవడమే కాకుండా కూరకు చిక్కదనాన్ని, మంచి రుచిని కూడా ఇస్తుంది.

వంటకాలు మరీ ముదురు ఎరుపుగా కనిపిస్తే, అందులో కొద్దిగా నిమ్మరసం లేదా కొంచెం పెరుగు వేసి బాగా కలపాలి. ఇది నూనె ఘాటును, జిడ్డును తగ్గించి కూర ఆకృతిని సమతుల్యం చేస్తుంది. ఈ చిట్కాలను పాటించడం ద్వారా మీ వంటకాలను పారవేయడంకి బదులుగా చక్కగా తినేయొచ్చు. ఈ చిట్కాలు ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా ఆహారం రుచిని కాపాడటానికి కూడా సహాయపడతాయి.