
పచ్చి మామిడి: శాస్త్రీయంగా చూస్తే, పచ్చి మామిడి విటమిన్ సి కి ఒక పవర్‌హౌస్ వంటిది. ఒక చిన్న పచ్చి మామిడికాయలో మూడు ఆపిల్ పండ్లు లేదా ఒక పెద్ద నారింజ పండులో ఉండేంత విటమిన్ సి ఉంటుంది. ఎండల వల్ల వచ్చే వడదెబ్బ నుండి రక్షించడంలో పచ్చి మామిడి అద్భుతంగా పనిచేస్తుంది. ఇది శరీరంలోని ఉప్పు, నీటి సమతుల్యతను కాపాడుతుంది. ఎసిడిటీ, మలబద్ధకం లేదా మార్నింగ్ సిక్‌నెస్‌తో బాధపడేవారు నల్ల ఉప్పుతో కలిపిన పచ్చి మామిడిని తింటే మంచి ఫలితం ఉంటుంది.

పండిన మామిడి: కంటి చూపుకు, చర్మ కాంతికి వరం మామిడి పండు పండినప్పుడు దానిలోని స్టార్చ్ చక్కెరగా మారుతుంది. అందుకే ఇది తియ్యగా ఉండటమే కాకుండా తక్షణ శక్తిని ఇస్తుంది. పండిన మామిడిలో విటమిన్ ఏ, బీటా-కెరోటిన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి కంటి చూపును మెరుగుపరచడమే కాకుండా చర్మాన్ని కాంతివంతంగా మారుస్తాయి. శరీర కణాలను దెబ్బతినకుండా కాపాడే యాంటీఆక్సిడెంట్లు, పీచు పదార్థం ఇందులో అధికంగా ఉంటాయి.

అతిగా తింటే ప్రమాదమే: ప్రకృతి ఇచ్చిన ఈ అమృతం మితంగా తింటేనే ఆరోగ్యం. అతిగా తింటే కొన్ని ఇబ్బందులు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బాగా పండిన మామిడి పండ్లలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. షుగర్ వ్యాధి ఉన్నవారు వైద్యుల సలహా మేరకే వీటిని తీసుకోవాలి. మామిడి పండ్లకు వేడి చేసే స్వభావం ఉంటుంది.

మామిపండ్లను ఎక్కువగా తింటే ముఖంపై మొటిమలు, గడ్డలు వచ్చే అవకాశం ఉంది. పులుపు ఎక్కువగా ఉండే పచ్చి మామిడి కీళ్ల నొప్పులను మరింత తీవ్రతరం చేస్తుంది. మామిడి పండు తొక్క పైభాగంలో ఉండే తెల్లటి జిగురును పూర్తిగా కడగకుండా తింటే గొంతు నొప్పి, ఇన్ఫెక్షన్, కడుపులో తిమ్మిర్లు రావచ్చు.

ఆయుర్వేద శాస్త్రం ప్రకారం.. పచ్చి మామిడి పైత్యం, వాతాన్ని సమతుల్యం చేస్తుంది. అదేవిధంగా, పండిన మామిడి పండ్లు శరీరానికి బలాన్ని మరియు జీవశక్తిని అందిస్తాయి. మీరు బరువు తగ్గాలని లేదా వేసవి తాపం నుండి తప్పించుకోవాలని చూస్తుంటే పచ్చి మామిడి ఉత్తమ ఎంపిక. అలా కాకుండా తక్షణ శక్తి, కంటి ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తే 'పండిన మామిడి'ని ఎంచుకోండి. అయితే ఏ రూపంలో తిన్నా అతి సర్వత్ర వర్జయేత్ అనే సూత్రాన్ని గుర్తుంచుకోండి..