
నోరూరించే పచ్చి బొప్పాయి పచ్చడిని ఇలా చేస్తే ఎంతో టేస్టీగా ఉంటుంది. అంతేకాదు, ఆరోగ్యానికి కూడా ఇది చాలా చాలా మంచిది. అయితే, దీనిని వేడి వేడి అన్నంలో తింటే ఇక స్వర్గమే. దీనిలో కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే పచ్చడి అద్భుతంగా ఉంటుంది. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం గురించి ఇక్కడ చదివి తెలుసుకుందాం..

పచ్చి బొప్పాయి పచ్చడికి కావలసిన పదార్థాలు:పచ్చి బొప్పాయి తురుము, లేదా రెండు కప్పుల చిన్న ముక్కలు, నాలుగు పచ్చిమిర్చి, ఎండుమిర్చి 6 లేక 7, అర కప్పు నూనె, పోపు దినుసులు ఒక టేబుల్ స్పూన్ స్పూన్ ఆవాలు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ మినపప్పు, అర టేబుల్ స్పూన్ శనగపప్పు, ఇంకా చింతపండు కొంచం తీసుకోవాలి. నాలుగు లేక 5 వెల్లుల్లి రెబ్బలు, రుచికి తగినంత ఉప్పు, నాలుగు కరివేపాకు, ఇంకా కొద్దిగా కొత్తిమీరను తీసుకోవాలి.

పచ్చి బొప్పాయిని ఇలా వేయించుకోవాలి : ముందుగా గ్యాస్ వెలిగించి స్టవ్ మీద పాన్ పెట్టి ఒక స్పూన్ నూనె వేయాలి. అది బాగా కాగిన తర్వాత దానిలో పచ్చి బొప్పాయి ముక్కలు, నాలుగు పచ్చిమిర్చి వేసి వాసన పోయే వరకు మీడియం మంటపై దీనిని బాగా వేయించుకోవాలి. ఒక విషయం బాగా గుర్తు పెట్టుకోండి ముక్కలను బాగా ఉడికించుకోవాలి.

పచ్చడిని ఇలా రుబ్బుకోవాలి: ఇంకా దీనిలో వేయించిన ఒక కప్పు బొప్పాయి ముక్కలు, పచ్చిమిర్చి వేసి మిక్సీ జార్‌లో గ్రైండ్ వేసుకోవాలి. ఇంకా దీనిలో వెల్లుల్లి, కొద్దిగా చింతపండు, రుచికి తగినంత ఉప్పును తీసుకుని దీనిలో వేసుకోవాలి. ఇంకా దీనిలో కొద్దిగా కొత్తిమీర కూడా వేసి దీనిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటే తినడానికి మంచిగా ఉంటుంది. అలాగే, ఇది అంత రుచిగా ఉంటుంది.

చివర్లో ఇలా పోపు పెట్టుకోవాలి : ఇప్పుడు ఇంకో పాన్‌లో కొద్దిగా ఆయిల్ వేసి అది బాగా వేడయ్యాక.. ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, కరివేపాకు, నాలుగు ఎండుమిర్చి కూడా వేసి దీనిని పోపు పెట్టాలి. ఇక చివర్లో రుబ్బి పెట్టుకున్న పచ్చి బొప్పాయి పచ్చడి మిశ్రమాన్ని దీనిలో వేసి నాలుగు నిమిషాల పాటు కలిపి స్టవ్ ఆఫ్ చేసి కిందకు దించి అన్నంలో పెట్టుకుని తినాలి.