
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది: పైనాపిల్‌లో బ్రోమెలైన్ అనే ప్రత్యేకమైన ఎంజైమ్ ఉంటుంది. ఇది మనం తినే ఆహారంలోని ప్రోటీన్లను సులభంగా విచ్ఛిన్నం చేసి, జీర్ణవ్యవస్థను వేగవంతం చేస్తుంది. గ్యాస్, అజీర్తి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలతో బాధపడేవారికి పైనాపిల్ అద్భుత నివారణగా పనిచేస్తుంది.

రోగనిరోధక శక్తి పెంచుతుంది: ఒక్క కప్పు పైనాపిల్ ముక్కల నుండి మన శరీరానికి రోజుకు కావలసిన విటమిన్ సీ లభిస్తుంది. ఇందులోని బలమైన యాంటీఆక్సిడెంట్లు తెల్ల రక్తకణాల ఉత్పత్తిని పెంచి, సీజనల్ వ్యాధులు, జలుబు, దగ్గు, ఇన్ఫెక్షన్ల నుండి శరీరాన్ని రక్షిస్తాయి.

కీళ్ల నొప్పులు, వాపుల నుండి ఉపశమనం: బ్రోమెలైన్ ఎంజైమ్‌కు ఉన్న సహజసిద్ధమైన వ్యాధి నిరోధక గుణాల వల్ల, ఇది ఆర్థరైటిస్ కండరాల నొప్పులతో బాధపడేవారికి మంచి ఉపశమనాన్ని ఇస్తుంది. వ్యాయామం తర్వాత వచ్చే కండరాల అలసటను తగ్గించడంలో కూడా ఇది తోడ్పడుతుంది.

చర్మ సౌందర్యం, గుండె ఆరోగ్యం: పైనాపిల్‌లోని విటమిన్ సీ, కొల్లాజెన్ చర్మాన్ని కాంతివంతంగా, దృఢంగా ఉంచడానికి సహాయపడతాయి. అలాగే, ఇందులో ఉండే పొటాషియం, పీచు పదార్థం రక్తపోటును అదుపులో ఉంచి, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని పరిరక్షిస్తాయి.

బరువు తగ్గడానికి అనుకూలం: పైనాపిల్‌లో నీటి శాతం ఎక్కువ, కలోరీలు చాలా తక్కువ. తీపి పదార్థాలు తినాలనిపించినప్పుడు కేలరీలు పెరగకుండా పైనాపిల్ ముక్కలు తినడం వల్ల కడుపు నిండిన భావన కలిగి, వేగంగా బరువు తగ్గడానికి ఉపకరిస్తుంది.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు: పైనాపిల్ ఆరోగ్యానికి ఎంతో మంచిదే అయినప్పటికీ, రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉన్న డయాబెటిస్ రోగులు దీనిని పరిమితంగా మాత్రమే తీసుకోవాలి. అలాగే, కొంతమందికి ఇందులో ఉండే యాసిడ్ వల్ల నోటిలో లైట్ గా మంట లేదా అలర్జీ రావచ్చు, అలాంటి వారు వైద్యుల సలహా మేరకు తీసుకోవడం మంచిది. అన్ని కాలాల్లోనూ లభించే ఈ అద్భుతమైన పైనాపిల్‌ను జ్యూస్ రూపంలో కాకుండా నేరుగా ముక్కలుగా కోసుకుని తినడం ద్వారా పూర్తి స్థాయి ఫైబర్, పోషకాలను పొందవచ్చు.