
కావలసిన పదార్థాలు: 2 గంటలు నానబెట్టిన సగ్గుబియ్యం, 1 కప్పు నిండుగా ఫూల్ మఖానా, 3½ కప్పుల చిక్కటి పాలు, అర కప్పు తురిమిన బెల్లం, పావు కప్పు నీళ్లు, 1 టీస్పూన్ ఆవు నెయ్యి, 10 నుండి 12 బాదం పప్పులు, 1 టీస్పూన్ పిస్తా పప్పులు, 4 నుండి 5 యాలకులు, చిటికెడు కుంకుమపువ్వు, గార్నిషింగ్ కోసం కొద్దిగా బాదం తరుగు

తయారీ విధానం: ఒక గిన్నెలో అర కప్పు పెద్ద సగ్గుబియ్యాన్ని తీసుకుని శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు పోసి కనీసం 2 గంటల పాటు నానబెట్టాలి. సగ్గుబియ్యం చక్కగా నాని వేళ్లతో నొక్కితే మెత్తగా నలిగేలా ఉండాలి. గిన్నెలో అర కప్పు తురిమిన బెల్లం, పావు కప్పు నీళ్లు పోసి స్టవ్‌పై పెట్టాలి. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత కేవలం ఒక నిమిషం పాటు మరిగించి స్టవ్ ఆఫ్ చేసి పక్కన ఉంచుకోవాలి. తీగ పాకం అవసరం లేదు.

కడాయిలో 1 టీస్పూన్ నెయ్యి వేడిచేసి.. 1 కప్పు ఫూల్ మఖానా వేసి లో-మీడియం మంటపై 3-4 నిమిషాలు కరకరలాడే వరకు వేయించి ప్లేట్‌లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. చిన్న మిక్సీ జార్‌లో 10-12 బాదం పప్పులు, 1 టీస్పూన్ పిస్తా పప్పులు, 4-5 యాలకులు వేసి చాలా మెత్తటి ఫైన్ పౌడర్‌లా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి.

అదే కడాయిలో 3½ కప్పుల (750 మి.లీ) చిక్కటి పాలు పోసి పొంగు వచ్చేంత వరకు మరిగించాలి. పాలు మరుగుతున్నప్పుడు నానబెట్టిన సగ్గుబియ్యంలోని నీటిని పూర్తిగా వంపేసి.. సగ్గుబియ్యాన్ని మాత్రమే పాలల్లో వేసి బాగా కలపాలి. ఇందులోనే చిటికెడు కుంకుమపువ్వు వేసి మీడియం మంటపై 5 నిమిషాలు ఉడికించాలి. సగ్గుబియ్యం ముత్యాల్లాగా ట్రాన్స్‌పరెంట్‌గా ఉడికి పైకి తేలుతాయి.

సగ్గుబియ్యం ఉడికిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న బాదం పొడిని వేసి ఉండలు కట్టకుండా వెంటనే గరిటెతో బాగా కలపాలి. మరో 2 నిమిషాలు ఉడికిస్తే మిశ్రమం క్రీమీగా చిక్కబడుతుంది. ఇప్పుడు సన్నగా తరిగిన బాదం పలుకులు, ముందుగా వేయించి పెట్టుకున్న ఫూల్ మఖానాను వేసి కలిపి వెంటనే స్టవ్ ఆఫ్ చేయాలి. మఖానా వేసాక ఉడికించాల్సిన పనిలేదు, వేడికే మెత్తబడతాయి.

పాయసం కాస్త గోరువెచ్చగా చల్లారిన తర్వాత.. సిద్ధం చేసి ఉంచుకున్న బెల్లం నీటిని టీ జల్లెడతో వడకడుతూ పోసి బాగా కలపాలి. అంతే, నోరూరించే బలవర్ధకమైన 'ఫూల్ మఖానా సగ్గుబియ్యం పాయసం' సిద్ధం! ఉదయాన్నే వేడివేడిగా లేదా ఫ్రిజ్‌లో చల్లార్చుకుని ఒక కప్పు తాగినా అమితమైన సంతృప్తినిస్తూ రోజంతా నూతనోత్తేజాన్ని, నిండు బలాన్ని అందిస్తుంది!