
పల్లీలలో శరీరానికి అవసరమైన ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో 25 నుండి 30 శాతం వరకు ప్రోటీన్ ఉండటం వల్ల శాఖాహారులకు ఇది అద్భుతమైన మాంసకృత్తుల వనరుగా పనిచేస్తుంది. వర్షాకాలంలో తరచూ దాడి చేసే సీజనల్ ఇన్ఫెక్షన్లను తట్టుకోవడానికి పల్లీల్లో ఉండే విటమిన్ ఇ, విటమిన్ బి6, మెగ్నీషియం, ఫాస్పరస్ మరియు జింక్ వంటి పోషకాలు శరీర రోగనిరోధక శక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో పల్లీలు ఎంతగానో దోహదపడతాయి. వీటిలోని మోనోఅన్‌శాచురేటెడ్, పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వులు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. అంతేకాకుండా దీనిలో ఉండే పీచు పదార్థం జీర్ణక్రియను మెరుగుపరిచి, రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. అలాగే పల్లీలలో ఉండే రెస్వెరాట్రాల్ అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ శరీరంలో వాపులను తగ్గించి, అకాల ముడతలు పడకుండా చర్మాన్ని సంరక్షిస్తుంది.

వర్షాకాలపు చల్లని వాతావరణంలో వేడివేడిగా ఉడకబెట్టిన లేదా దోరగా వేయించిన పల్లీలను తినడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే నూనెలో డీప్ ఫ్రై చేసినవి లేదా ఎక్కువ ఉప్పు ఉన్న పల్లీలకు దూరంగా ఉండటం మంచిది. ఒక సాధారణ ఆరోగ్యవంతమైన వ్యక్తి రోజుకు సుమారు 50 గ్రాములు పల్లీలను హాయిగా తినవచ్చు. బరువు తగ్గాలనుకునే వారు మాత్రం రోజుకు 30 గ్రాములకు పరిమితం కావడం మంచిది.

పోషకాలు ఎక్కువగా ఉన్నప్పటికీ, పల్లీలు అందరికీ మంచివి కావు. ముఖ్యంగా పల్లీల అలర్జీ ఉన్నవారు వీటిని తింటే దద్దుర్లు, వాపులు, శ్వాస తీసుకోవడంలో తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతాయి. అలాగే కిడ్నీ, కాలేయ సంబంధిత సమస్యలు ఉన్నవారు, రక్తాన్ని పల్చబరిచే మందులు వాడేవారు, గ్యాస్, ఎసిడిటీతో బాధపడేవారు పల్లీల వినియోగాన్ని పరిమితం చేయాలి లేదా వైద్యుల సలహా తీసుకోవాలి.

ఏదైనా పరిమితికి మించితే ప్రతికూల ఫలితాలు ఇస్తుంది కాబట్టి పల్లీలను అతిగా తింటే అధిక కేలరీల వల్ల బరువు పెరగడం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు రావచ్చు. ముఖ్యంగా ఉప్పు ఎక్కువగా ఉన్న పల్లీలు తింటే బీపీ పెరిగే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ వర్షాకాలంలో రుచితో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, తగిన పరిమాణంలో ఉడకబెట్టిన లేదా వేయించిన పల్లీలను మీ రోజువారీ ఆహారంలో భాగం చేసుకోండి.