
పచ్చి చలిమిడి అనేది శ్రీరామనవమి, వరలక్ష్మి వ్రతం, వినాయక చవితి , ఇతర పండుగలకు దేవునికి నైవేద్యంగా తయారు చేసే ఎంతో రుచికరమైన సాంప్రదాయ వంటకం. దీనికి కావాల్సిన పదార్దాలు, సులభంగా ఎలా తయారు చేయాలో ఇక్కడ వివరంగా చదివి తెలుసుకుందాం ..

ఈ సాంప్రదాయ తీపి వంటకాన్ని ఎక్కువగా పండుగలు సమయంలో ఇంకా శుభకార్యాలలో తయారుచేస్తూ ఉంటాము. ముఖ్యంగా, ఆడపిల్లను పెళ్లి చేసుకుని అత్తగారి ఇంటికి పంపేటప్పుడు చేస్తారు. సారెగా పెట్టేటప్పుడు చలిమిడికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. అలాంటి చలిమిడిని అందరూ సులువుగా, పర్ఫెక్ట్ కొలతలతో, నోట్లో వెన్నలా కరిగిపోయేంత మృదువుగా ఎలా తయారుచేయాలో ఇక్కడ చూద్దాం..

పచ్చి చలిమిడికి కావాల్సిన పదార్థాలు: రెండు కప్పుల బియ్యం పిండి (పచ్చి బియ్యం పిండి లేదా అప్పటికప్పుడు బియ్యం పిండి), ఒక కప్పు బెల్లం, ముప్పావు కప్పు నెయ్యి, రెండు టేబుల్ స్పూన్లు యాలకుల పొడి, ఒక కప్పు నీరును తీసుకోవాలి. సరైన కొలతలతో దీనిని చెస్తే ఎంతో రుచిగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి.

రుచికరమైన, మెత్తని చలిమిడి కోసం మొదటి ముఖ్యమైన చిట్కా బియ్యాన్ని నానబెట్టడం. పిండి మృదువుగా, చలిమిడి ఎంతో రుచిగా ఉండాలంటే బియ్యాన్ని ఒక రోజంతా తప్పకుండా నానబెట్టాలి. ఇంట్లో సాధారణంగా వాడే బియ్యం కాకుండా, రేషన్ బియ్యాన్ని వాడటం వల్ల చలిమిడి మరింత బాగా వస్తుంది.

ఒక పెద్ద పాత్ర తీసుకుని దానిలో జల్లెడ పట్టిన బియ్యం పిండిని దీనిలో తీసుకోవాలి. ఇంకా దీనిలో తురిమిన బెల్లం కూడా వేసి చేతితోనే కలుపుకోవాలి. ఇంకా బెల్లం, బియ్యం పిండి కలిసిపోయేలా దీనిని కలుపుతుండాలి. బెల్లంలోని తేమ వలన పిండి ఒక ముద్దలా అవుతుంది. అవసరమైతే దీనిలో కొద్దిగా నీరు కానీ నెయ్యిని వేసుకోవాలి.