
అంగరంగ వైభవంగా వివాహం.. భారీగా కట్నకానుకలు.. కూతురు వైవాహిక జీవితం కోసం అప్పులు చేసి మరి పెళ్లి చేశారు. అల్లుడు సర్కారు కొలువని నమ్మి భవిష్యత్తు బాగుంటుందని ఆశతో వివాహం చేసి పంపారు. ఆ అశలు ఆ తల్లిదండ్రులకు ఎంతో కాలం నిలవలేదు. కాళ్ల పారాణి అరకముందే ఆ నవ వధువు తనువు చాలించింది. పెళ్లయి రెండు నెలలకే ఊపిరి వదిలేసింది. నమ్మించి మోసం చేయడమే కాదు.. మరొకరి మోజులో ఆమెను వదిలించుకోవాలనే టార్చర్ చేసి బలవనమరణానికి కారకుడు అయ్యాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఏడడుగులు వేసిన వ్యక్తితో జీవితంపై ఎన్నో ఆశలు.. స్వగ్రామం నుంచి జిల్లా దాటి నగరానికి భర్తతో కలిసి వచ్చింది. జీవితంపై కోటి ఆశలతో విశాఖ నగరంలో కాపురం పెట్టింది. కానీ రెండు నెలలు తిరగకముందే జీవితం అర్ధంతారంగా ముగిసిపోయింది. ఆత్మహత్య చేసుకుందని భర్త చెబుతుండగా.. కట్నం కోసం హత్య చేశాడని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

శ్రీకాకుళం జిల్లా గార మండలం శిమ్మపేటకు చెందిన తేజశ్రీకి.. అదే జిల్లా అరాగోలు సమీపంలోని గూడెం గ్రామానికి చెందిన దప్ప సోమేశ్వరరావుతో మార్చి ఆరో తేదీన వివాహం జరిగింది. కట్నం కింద 18 లక్షలు నగదు, 19 తులాల బంగారు ఆభరణాలు, సారె, లాంఛనాల కింద మరో 10 లక్షలు ఇచ్చారు. తాను విశాఖ డాక్‌యార్డులో పనిచేస్తున్నానని, రామాటాకీస్ వద్ద ఉమెన్స్ హాస్టల్ ఉందని.. వాటి ద్వారా నెలకు 2 లక్షల ఆదాయం వస్తున్నట్టు పెళ్ళికి ముందు ముందు తేజశ్రీ పేరెంట్స్ కు నమ్మించాడు సోమేశ్వరరావు. తన కూతురికి వివాహం గ్రాండ్ గా జరిపించారు తేజశ్రీ పేరెంట్స్. ఆ తరువాత తేజశ్రీని విశాఖ తీసుకొచ్చి రేసపువానిపాలెంలో కాపురం పెట్టాడు సోమేశ్వరారావు. విశాఖకు వచ్చిన మరుసటిరోజు నుంచే తేజశ్రీకి టార్చర్ మొదలైంది.

మరింత కట్నం కావాలంటూ భార్యను వేధించసాగాడు. ఇదే విషయాన్ని ఆమె తన తల్లిదండ్రులకు తెలపగా సర్దుకుపోవాలని సూచించారు. శారీరకంగా మానసికంగా టార్చర్ పెట్టాడు. అందం చూసి కాదని.. కేవలం డబ్బు కోసమే వివాహం చేసుకున్నానని తేజశ్రీతో చెప్పి ఎమోషనల్ గా బ్లాక్మెయిల్ చేసినట్టు పేరెంట్స్కు చెప్పి తేజశ్రీ ఆవేదన చెండేదని అన్నారు త్రీ టౌన్ సిఐ పైడయ్య. కాగా ఈ నెల ఏడో తేదీన తల్లి శారద తన కుమార్తెకు ఫోన్ చేయగా ఆమె స్పందించలేదు. అల్లుడు ఫోన్ లిఫ్ట్ చేసి మీ కుమార్తె ఉరి వేసుకుంది అని చెప్పడంతో వెంటనే తేజశ్రీ పేరేంట్స్ విశాఖ చేరుకున్నారు. ఇంటికి వెళ్లి చూసే సరికి.. ఆమె విగతజీవిగా మంచంపై పడి ఉంది. దీంతో, గుండెలవిసేలా రోదించారు తేజశ్రీ పేరేంట్స్. తేజశ్రీ శరీరంపై గాయాలు, మెడపై గట్టిగా బిగించిన గుర్తులు కనిపించడంతో అల్లుడే కట్నం కోసం హత్య చేశాడని అనుమానిస్తూ త్రీటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కూతురికి అల్లుడు టార్చర్ పెట్టేవాడని.. అయినా సర్ది చెప్పి పంపిస్తే.. ఊపిరి తీసేలా చేశాడని ఆ ఫిర్యాదులో ఆవేదన చెందారు.

మృతురాలి తల్లి శారద ఫిర్యాదు తో త్రీటౌన్ పోలీసులు 85, 108 బీఎన్‌ఎస్, 3,4 డీపీఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తేజశ్రీ నూతనదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు పోలీసులు. నిందితుడు సోమేశ్వరరావును అరెస్టు చేశామన్నారు సిఐ పైడయ్య. సోమేశ్వరరావుకు మరి కొంతమంది యువతులతో పరిచయాలు కూడా ఈ కలహాలకు కారణమైందని ప్రాథమికంగా గుర్తించామన్నారు.

అనుమానాస్పద మృతి కేసు కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. తేజశ్రీ ప్రాణాలు కోల్పోయేందుకు సోమేశ్వరరావు కారణమని తెల్చారు పోలీసులు. పోస్టుమార్టం రిపోర్ట్ కోసం పోలీసులు వేసి చూస్తున్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. నవ జంట మధ్య కలహాల కాపురం చిచ్చు పెట్టింది. వాడి టార్చర్ తట్టుకోలేక వధువు తనువు చాలిస్తే.. ఆ చావుకు బాధ్యుడై వరుడు కటకటాల్లోకి వెళ్ళాడు.