
ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టి, ఒక కప్పు పెసరపప్పును చిన్న మంట మీద దోరగా వేయించాలి. పెసరపప్పు నుండి మంచి సువాసన వచ్చి, లేత బంగారు రంగులోకి మారే వరకు కనీసం ఐదు నుండి పది నిమిషాలు వేయించాలి. ఇలా వేయించిన పెసరపప్పును ఒక గిన్నెలోకి తీసుకోండి.మనం పెసరపప్పు తీసుకున్న అదే కప్పుతో ఒక కప్పు బియ్యం తీసుకోండి. ఈ బియ్యం, వేయించిన పెసరపప్పును కలిపి, నీళ్లతో రెండు మూడు సార్లు శుభ్రంగా కడగాలి. నానబెట్టాల్సిన అవసరం లేదు, కేవలం కడిగితే సరిపోతుంది. నీళ్లన్నీ వంపేసి పక్కన పెట్టుకోవాలి. మరో పొయ్యి మీద ఒక పెద్ద గిన్నె పెట్టి, అందులో మనం కొలతలకు ఉపయోగించిన అదే కప్పుతో ఆరు కప్పుల నీళ్లు పోసి, మూత పెట్టి బాగా తెర్లకాగనివ్వాలి.

ఇప్పుడు కుక్కర్ గిన్నెను స్టవ్ మీద పెట్టి, పావు కప్పు వెన్న వేసి కరిగించాలి. వెన్న కరిగిన తర్వాత కడిగి పెట్టుకున్న బియ్యం, పప్పు మిశ్రమాన్ని వేసి మీడియం ఫ్లేమ్ లో ఐదు నిమిషాల పాటు వేయించాలి. ఇలా వెన్నలో వేయించడం వల్ల పొంగలికి అద్భుతమైన రుచి, సువాసన వస్తాయి.

బియ్యం, పప్పు వేగిన తర్వాత, మరిగిస్తున్న ఆరు కప్పుల నీళ్లను అందులోకి పోసి, ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసి బాగా కలపాలి. కుక్కర్ మూత పెట్టి, మీడియం ఫ్లేమ్ లో మూడు లేదా నాలుగు విజిల్స్ రానివ్వండి. నాలుగు విజిల్స్ కంటే ఎక్కువ ఉడికించకూడదు, లేదంటే రైస్ ముద్దగా అయిపోతుంది. ప్రెషర్ తగ్గిన తర్వాత మూత తీస్తే పొంగలి సరైన కన్సిస్టెన్సీలో ఉండి ఉండాలి. అవసరమైతే మరికాస్త నీళ్లు పోసి ఉడికించుకోవచ్చు.

ఉడికిన పొంగలి గిన్నెను స్టవ్ మీద సిమ్ లో ఉంచి, మరో బర్నర్ మీద పాన్ పెట్టి, ముప్పావు కప్పు నెయ్యి వేసి కరిగించాలి. నెయ్యి కరిగిన తర్వాత, అందులో ఒక టేబుల్ స్పూన్ మిరియాలు, రెండు టేబుల్ స్పూన్ల అల్లం తరుగు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి అల్లం పచ్చివాసన పోయే వరకు వేయించాలి.

తరువాత, ఎనిమిది నుండి పది సన్నగా తరిగిన పచ్చిమిర్చి, నాలుగు ఎండుమిర్చి తుంచి వేసి వేయించాలి. అర కప్పు జీడిపప్పు పలుకులు వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. చివరగా, అర కప్పు కరివేపాకు, పావు టీస్పూన్ ఇంగువ వేసి కలిపి, స్టవ్ ఆపివేయండి.ఈ తాలింపు మొత్తాన్ని ఉడికించి సిద్ధంగా ఉన్న పొంగలిలో వేసి బాగా కలపండి. వేడివేడి కట్టె పొంగలి వడ్డించడానికి సిద్ధంగా ఉంటుంది.