
ఒక కోడిగుడ్డు సుమారు 72 కేలరీల శక్తిని ఇస్తుంది. 100 గ్రాముల కోడిగుడ్డులో దాదాపు 100 కేలరీల శక్తి ఉంటుంది. గుగ్గిళ్ళు తయారుచేసే పప్పుధాన్యాలు, అంటే బొబ్బర్లు, శనగలు, పెసలు వంటివి 100 గ్రాములకు 340 నుంచి 350 కేలరీల శక్తిని అందిస్తాయి. అంటే, గుడ్ల కంటే మూడు రెట్లకు పైగా బలం గుగ్గిళ్ళలో ఉందని స్పష్టమవుతుంది. ప్రత్యేకించి సోయా చిక్కుడు గింజలు మరింత బలమైనవి. 100 గ్రాముల సోయాలో దాదాపు 440 కేలరీల శక్తి, 43 గ్రాముల ప్రోటీన్ ఉంటాయి, ఇది అపారమైన బలమని అంటున్నారు.

బొబ్బర్లను కనీసం 10 గంటలు నీటిలో నానబెట్టాలి. రాత్రిపూట నానబెడితే ఉదయానికి సిద్ధంగా ఉంటాయి. నానబెట్టిన పప్పుధాన్యాలను కుక్కర్‌లో వేసి మెత్తగా ఉడికించాలి. గుగ్గిళ్ళు సాధారణంగా మెత్తగా ఉంటాయి. ఉడికించిన గింజలలో 30-40% పప్పులను తీసి మిక్సీలో పలుకుపలుకుగా గ్రైండ్ చేయాలి. మరీ పిండిలా కాకుండా వడలకు ఎలా రుబ్బుతారో అలా రుబ్బాలి. మిగతా 50-60% పప్పులను అలాగే ఉంచుకోవాలి. మెత్తగా రుబ్బిన పప్పును, ఉడికించిన పప్పును కలపాలి. ఇలా చేయడం వల్ల గుగ్గిళ్ళు కొంచెం గ్రేవీ లాగా ఉండి, తినడానికి రుచికరంగా ఉంటాయి.

ఈ మిశ్రమానికి నెయ్యితో తాలింపు పెట్టాలి. నూనె కంటే నెయ్యి గుగ్గిళ్ళకు మంచి రుచిని ఇస్తుంది. తాలింపులో ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ, కరివేపాకు వేయాలి. తాలింపు వేసిన తర్వాత, అందులో కొద్దిగా చాట్ మసాలా పొడిని కలపాలి. ఇది ప్రత్యేక రుచిని ఇస్తుంది మరియు ఉప్పు అవసరాన్ని తగ్గిస్తుంది. చాట్ మసాలాలో రాక్ సాల్ట్, మామిడి పొడి వంటివి ఉండటం వల్ల ఉప్పు వేసిన ఫీలింగ్ కలుగుతుంది. చివరగా, నిమ్మరసం పిండుకుని తింటే రుచి మరింత పెరుగుతుంది.

బొబ్బర్లతో పాటు, శనగలు కూడా తిసుకోవచ్చు. మనకి ఇవే అందుబాటులో ఉంటాయి కాబట్టి ఇది తినండి. పెసలు, సోయా చిక్కుడు గింజలతో కూడా గుగ్గిళ్ళు చేసుకోవచ్చు. ప్రతి రోజుకో రకం పప్పుధాన్యంతో గుగ్గిళ్ళు తయారుచేసి ఇవ్వడం వల్ల పిల్లలు ఇష్టంగా తింటారు, వారికి విసుగు అనిపించదు. మొలకెత్తిన పప్పుధాన్యాలు తినని వారికి గుగ్గిళ్ళు ఒక అద్భుతమైన ఎంపిక. ఇవి శరీరానికి ఎటువంటి హాని కలిగించవు, కేవలం లాభాలనే చేకూరుస్తాయి.

గుడ్లు, పాలపై పెట్టే ఖర్చును తగ్గించి, బదులుగా ఇటువంటి బలవర్ధకమైన గుగ్గిళ్ళను ఆహారంలో చేర్చుకోవడం వల్ల మనము, మన పిల్లలు ఆరోగ్యంగా ఉంటామని అంటున్నారు. మందులపై ఆధారపడకుండా, ఖర్చుతో కూడుకున్న ఇతర ఆహారాల జోలికి వెళ్లకుండా, సహజసిద్ధమైన, బలమైన గుగ్గిళ్ళ ద్వారా ఆరోగ్యాన్ని పొందాలని ఆయన సూచించారు.