
కావలసిన పదార్థాలు: 2 కప్పులు రాగులు, 1 కప్పు కొర్రలు, 1 కప్పు సజ్జలు, 1 కప్పు జొన్నలు, 1 కప్పు సామలు, అంబలి కాచడానికి: తయారుచేసుకున్న మిల్లెట్ పిండి – 4 టేబుల్ స్పూన్లు, 1 లీటర్ నీళ్లు, రుచికి సరిపడా ఉప్పు, పావు టీస్పూన్ జీలకర్ర పొడి, పావు టీస్పూన్ మిరియాల పొడి. చలువ చేసే అంబలి కోసం: రాత్రంతా పులిసిన గంజి తగినంత, 1 గ్లాసు చిక్కటి పెరుగుతో చేసిన మజ్జిగ, 1 చిన్న ఉల్లిపాయ తరుగు, 2 పచ్చిమిర్చి ముక్కలు, పావు టీస్పూన్ జీలకర్ర పొడి

తయారీ విధానం: ఒక పెద్ద బౌల్లో 2 కప్పుల రాగులు, 1 కప్పు కొర్రలు, 1 కప్పు సజ్జలు, 1 కప్పు జొన్నలు, 1 కప్పు సామలు వేయాలి. చిరుధాన్యాల్లో మట్టి, పొట్టు ఎక్కువగా ఉంటుంది కాబట్టి నీళ్లు పోసి 3 నుండి 4 సార్లు నీళ్లు తేటగా వచ్చే వరకు శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత మంచి నీళ్లు పోసి రాత్రంతా లేదా కనీసం 8 నుండి 10 గంటలు నానబెట్టుకోవాలి.మరుసటి రోజు ఉదయం ఆ నీటిని వంపేసి మళ్లీ రెండు సార్లు కడిగి, చిల్లుల గిన్నెలో వేసి 30 నిమిషాలు నీరంతా కారిపోయేలా ఉంచాలి. ఆ తర్వాత కాటన్ క్లాత్‌పై పలుచగా పరచి ఫ్యాన్ కింద 4-5 గంటలు (లేదా ఎండలో 2 గంటలు) తడి ఏమాత్రం లేకుండా పూర్తిగా ఆరబెట్టాలి.

బాగా ఆరిన గింజలను చిన్న మిక్సీ జార్లో వేసి.. మరీ మెత్తటి పౌడర్లా కాకుండా అక్కడక్కడా సన్నటి నైస్ రవ్వలా (బరకగా) గ్రైండ్ చేసుకోవాలి. పిండి వేడి తగ్గే వరకు 2 గంటలు ఆరబెట్టి, గాలి చొరబడని డబ్బాలో భద్రపరుచుకుంటే నెల రోజుల పాటు తాజాగా ఉంటుంది.ఒక గిన్నెలో 4 స్పూన్ల మిల్లెట్ పౌడర్ తీసుకుని కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ ఉండలు లేకుండా జారుడుగా కలపాలి. స్టవ్‌పై మట్టి కుండ లేదా గిన్నె పెట్టి 1 లీటర్ నీళ్లు పోసి బాగా మరిగించాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు కలిపి ఉంచుకున్న పిండి మిశ్రమాన్ని పోసి గరిటెతో ఆపకుండా కలుపుతూ ఉండాలి. మీడియం-లో ఫ్లేమ్‌పై సుమారు 15 నిమిషాల పాటు చిరుధాన్యాల రవ్వ మెత్తగా ఉడికే వరకు కాచి స్టవ్ ఆఫ్ చేయాలి.

ఇలా ఉడికించిన మిశ్రమం వేడిగా ఉన్నప్పుడే కావలసినంత ఒక గ్లాసులోకి తీసుకోవాలి. ఇందులో చిటికెడు ఉప్పు, జీలకర్ర పొడి, మిరియాల పొడి వేసి కలుపుకోవాలి. పిల్లలకు ఇచ్చేటట్లయితే చిక్కటి పాలు కలపవచ్చు. వర్షాకాలం, శీతాకాలంలో లేదా ఉదయం టీ-కాఫీలకు బదులుగా ఈ వేడి జావా తాగితే తక్షణ ఉత్తేజం, ఎముకలకు పుష్టి కలుగుతాయి. మిగిలిన గంజిని మూతపెట్టి రాత్రంతా అలాగే గది ఉష్ణోగ్రత వద్ద పులియబెట్టాలి. మరుసటి రోజు ఉదయానికి ఇది కాస్త గట్టిపడి కమ్మటి పుల్లటి వాసనతో సహజ ప్రోబయోటిక్‌గా మారుతుంది.

ఇప్పుడు కావలసినంత పులిసిన గంజిని గిన్నెలోకి తీసుకుని.. చిలికిన చిక్కటి మజ్జిగను పోసి బాగా కలపాలి. ఇందులో తగినంత ఉప్పు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర మరియు కొద్దిగా జీలకర్ర పొడి వేసి కలపాలి. అంతే, అమృతతుల్యమైన 'చిరుధాన్యాల అంబలి' సిద్ధం! ఎండల వేళ లేదా ఉదయం టిఫిన్‌గా దీనిని తాగితే పొట్టకు అమితమైన చలవ చేయడమే కాకుండా.. రోజంతా కడుపు తేలికగా ఉండి షుగర్, బీపీ, బరువును సహజంగా నియంత్రిస్తుంది!