
వర్షపు నీటిలో నైట్రోజన్ సమృద్ధిగా ఉండటం వల్ల మొక్క వేగంగా పెరిగి ఆకులు పచ్చగా, గుబురుగా మారుతాయి. అయితే వర్షాకాలంలో నీరు ఎక్కువై వేర్లు కుళ్లిపోవడం, మట్టిలో ఫంగస్ లేదా చీమలు చేరడం వంటి సమస్యలు రాకుండా ఉండటానికి కొన్ని జాగ్రత్తలు పాటించాలి.

ముందుగా, తులసి కుండీలో కుళ్లిపోయిన లేదా పసుపు రంగులోకి మారిన ఆకులను ఎప్పటికప్పుడు తొలగించాలి. ఇవి మట్టిలో ఫంగస్‌ను పెంచుతాయి. అలాగే కుండీ కింద ఉండే డ్రైనేజీ రంధ్రాలు మూసుకుపోకుండా నీరు సులభంగా బయటకు వెళ్లేలా చూడాలి.

వర్షాకాలంలో అప్పుడప్పుడు కుండీలోని మట్టిని గుల్లగా కలుపుతూ ఉంటే మట్టి గడ్డకట్టకుండా వేర్లకు గాలి సరిగ్గా అందుతుంది. తులసి మొక్కను ఆరోగ్యంగా, దట్టంగా పెంచడానికి ఇంట్లోనే లభించే సహజ సిద్ధమైన ఎరువులను వాడవచ్చు

మొదటిది కలబంద ఒక అద్భుతమైన నాచురల్ రూటింగ్ హార్మోన్ మరియు ఫంగిసైడ్. కలబంద ముక్కలను మట్టిలో పూడ్చడం ద్వారా లేదా పేస్ట్ చేసి నీటిలో కలిపి లిక్విడ్ ఫర్టిలైజర్‌గా 15 రోజులకు ఒకసారి ఇస్తే వేర్ల పెరుగుదల బాగుంటుంది. రెండవది అర స్పూన్ ఫ్రెష్ టీ పొడి లేదా కడిగి ఆరబెట్టిన వాడేసిన టీ పొడి 4-5 స్పూన్లు తో పాటు అర స్పూన్ పసుపు పొడిని మట్టిలో కలపాలి. పసుపు క్రిమిసంహారకంగా పనిచేసి కీటకాలు, ఫంగస్ నుంచి కాపాడుతుంది.

మూడవది వేపాకులను నీటిలో మరిగించి చల్లారాక పల్చగా చేసి చల్లితే తెగుళ్లు రాకుండా ఉంటాయి. మట్టిలో చీమలు, పురుగులు ఉంటే కొద్దిగా పటికను కరిగించిన నీటిని కుండీలో పోస్తే అవి పూర్తిగా నివారించబడతాయి. ఈ చిన్న చిన్న చిట్కాలతో వర్షాకాలంలో తులసి మొక్కను ఎంతో ఆరోగ్యంగా, గుబురుగా పెంచుకోవచ్చు.