
కావలసిన పదార్థాలు: శుభ్రంగా కడిగి ఆకులు వేరుచేసిన 1 పెద్ద కట్ట తాజా మెంతికూర, ముక్కలుగా తరిగిన 4 మీడియం సైజు బాగా పండిన టమాటాలు, 9 నుండి 10 పచ్చిమిరపకాయలు, 4 నుండి 5 ఎండు మిరపకాయలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, అర టీస్పూన్ జీలకర్ర, చిన్న ఉసిరికాయ సైజు అంత చింతపండు, 4 వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా కల్లుప్పు, పోపు దినుసులు, 1 రెమ్మ కరివేపాకు, సరిపడా వంట నూనె

తయారీ విధానం: స్టవ్‌పై పాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ నూనె వేడిచేయాలి. నూనె కాగిన తర్వాత అర టీస్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసి దోరగా వేయించాలి. ఇప్పుడు మంటను లో ఫ్లేమ్‌లో ఉంచి 4-5 ఎండుమిర్చి, 9-10 పచ్చిమిర్చి వేసి మాడిపోకుండా వేయించాలి. పచ్చిమిర్చి వేగిన తర్వాత శుభ్రంగా కడిగి ఉంచుకున్న ఒక కట్ట మెంతికూరను వేయాలి. మీడియం మంటపై మెంతికూరలోని పచ్చివాసన, తేమ పూర్తిగా ఆవిరైపోయే వరకు 2 నిమిషాలు వేయించి మిక్సీ జార్‌లోకి తీసుకుని చల్లారనివ్వాలి.

అదే పాన్‌లో 2 టేబుల్ స్పూన్ల నూనె వేడిచేయాలి. నూనె కాగాక తరిగిన 4 టమాటా ముక్కలు, ఉసిరికాయ సైజు చింతపండు వేయాలి. మీడియం ఫ్లేమ్‌పై గరిటెతో కలుపుతూ టమాటాలు మెత్తగా గుజ్జులా మారే వరకు మగ్గించి స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి.

ముందుగా మిక్సీ జార్లో ఉన్న చల్లారిన మెంతికూర-మిర్చి మిశ్రమంలో 4 వెల్లుల్లి రెబ్బలు వేయాలి. మిక్సీని ఆపుతూ ఆపుతూ బరకగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తటి పేస్ట్‌లా చేయకూడదు. ఇప్పుడు ఇందులోనే చల్లారిన టమాటా-చింతపండు గుజ్జు, రుచికి సరిపడా కల్లుప్పు వేసి.. రోట్లో రుబ్బిన టెక్స్చర్ వచ్చేలా కాస్త పలుకుగా మిక్సీ పట్టి బౌల్లోకి తీసుకోవాలి.

చిన్న కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేడిచేయాలి. నూనె కాగిన తర్వాత పోపు దినుసులు, దంచిన 6-7 వెల్లుల్లి రెబ్బలు, తుంచిన 3 ఎండుమిర్చి, కరివేపాకు వేసి వెల్లుల్లి ఎర్రబడే వరకు వేయించాలి. ఈ సువాసనభరితమైన తాలింపును పచ్చడిలో వేసి బాగా కలుపుకోవాలి. అంతే, నోరూరించే కమ్మనైన 'మెంతికూర టమాటా రోటి పచ్చడి' సిద్ధం! వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని ఈ పచ్చడితో తింటుంటే చేదు అస్సలు తెలియకుండా అమృతతుల్యంగా ఉంటుంది!