
ఆపదలో ఉన్న ప్రాణాన్ని కాపాడాలంటే.. కాలంతో పోటీ పడాలి..! ట్రాఫిక్ పద్మవ్యూహంలో సైరన్ మోగిస్తూ.. మృత్యువుతో పోరాడే బాధితుడిని ఆసుపత్రి తీసుకురావడం పెద్ద యుద్ధమే..సాధారణంగా అంబులెన్స్ డ్రైవర్లుగా పురుషులే కనిపిస్తారు. కానీ.. ఆ అపోహను చెరిపేసింది. ఆమె చేతులు స్టీరింగ్ పడితే.. మృత్యువు కూడా దారి ఇవ్వాల్సిందే..! ఆమే మన్నెం కల్పన..!

ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం.. ఒక సామాన్య రైతు కుటుంబం. డిగ్రీ పూర్తి చేశారు.. టీచర్‌గా పిల్లలకు పాఠాలు చెప్పుకుంటూ జీవిస్తుంది. కానీ, ఆ నాలుగు గోడల మధ్యే తన జీవితం ముగిసిపోకూడదు అనుకున్నారు. సమాజానికి ఏదో ఒకటి చేయాలి.. ఆపదలో ఉన్నవారికి అండగా నిలవాలి..! అదే సంకల్పం ఆమెను డ్రైవింగ్ సీటు వైపు నడిపించింది.

ఏపీఎస్‌ఆర్టీసీ ఇచ్చిన శిక్షణలో 15 మంది ఉంటే.. మగాళ్లతో పోటీ పడి నిలబడ్డ ఏకైక మహిళ కల్పన..! ఆంధ్రప్రదేశ్‌లోనే భారీ వాహనాలను నడిపే హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ పొందిన తొలి మహిళగా రికార్డు సృష్టించారు.

అవసరాన్ని బట్టి కొన్ని వందల కిలోమీటర్లు ప్రయాణం చెయ్యాలి.42 ఏళ్ల వయసులో ఇది నీ వల్ల కాదు.. అన్నవారి నోళ్లు మూయించి.. ఇప్పుడు విజయవాడ GGHలో ప్రాణదాతగా మారారు.

పగలు రాత్రి అనే తేడా లేదు.. నైట్ షిఫ్టుల్లోనూ ఆమె డ్యూటీకి రెడీ.. వందల కిలోమీటర్ల ప్రయాణం.. ప్రాణభయం ఉన్న రోగులు.. వెనకాల ఏడుస్తున్న బంధువులు.. వీరందరినీ ధైర్యంగా గమ్యస్థానానికి చేరుస్తున్నారు. 42 ఏళ్ల వయసులో ఆమె చూపిస్తున్న ఈ తెగువ.. నేటి తరం ఆడపిల్లలకు ఒక పాఠం.సాహసానికి.. సేవాగుణానికి నిలువెత్తు రూపం.. మన మన్నెం కల్పన..!