
ఒక పెద్ద గిన్నెలో మైదా పిండి, ఉప్పు వేసి కలపాలి. ఇందులో 2 టేబుల్ స్పూన్ల పచ్చి నూనె వేసి, పిండికి బాగా పట్టేలా చేతులతో రుద్దుతూ కలపాలి. పిండిని గట్టిగా నొక్కితే ముద్దలా అవ్వాలి, ఇది నూనె సరిపోయినట్లు సూచిస్తుంది. ఇప్పుడు కొద్దికొద్దిగా నీరు పోస్తూ, పిండిని చపాతీ పిండి కంటే కొంచెం గట్టిగా కలుపుకోవాలి. పిండి ఆరిపోకుండా కొద్దిగా నూనె రాసి, మూత పెట్టి కనీసం 15 నిమిషాల పాటు నాననివ్వాలి.

పిండి నానబెట్టే సమయంలో, పాకం తయారుచేయాలి. ఒక గిన్నెలో ఒక కప్పు పంచదార, ఒక కప్పు నీరు వేసి మీడియం మంటపై పంచదార కరిగే వరకు మరిగించాలి. పంచదార పూర్తిగా కరిగిన తర్వాత, మంటను మీడియంలో ఉంచి మరో ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి. పాకం జిగురుగా ఉండాలి . తీగ పాకం రాకూడదు. స్టవ్ ఆపివేసి, మంచి రుచి కోసం యాలకుల పొడి, పాకం గట్టిపడకుండా ఒక టీ స్పూన్ నిమ్మరసం, ఒక టీ స్పూన్ నెయ్యి కలిపి మూత పెట్టి పక్కన పెట్టాలి. పాకం వెచ్చగా ఉండాలి.

నానిన పిండిని మరో రెండు నిమిషాలు బాగా మర్దనా చేసి, ఐదు సమభాగాలుగా విభజించాలి. మిగిలిన పిండి ఆరిపోకుండా మూతపెట్టి ఉంచాలి. ఒక్కో పిండి ముద్దను చాలా పలుచగా చపాతీలా ఒత్తుకోవాలి. చపాతీలను ఒత్తేటప్పుడు పొడి పిండిగా కార్న్‌ఫ్లోర్ వాడితే కాజాలు మరింత క్రిస్పీగా వస్తాయి. కార్న్‌ఫ్లోర్ లేకపోతే మైదా పిండిని ఉపయోగించవచ్చు. ఇదే విధంగా ఐదు చపాతీలను ఒత్తి సిద్ధంగా ఉంచుకోవాలి. ఒక చపాతీని కింద పెట్టి, దానిపైన కొద్దిగా నూనెను అన్నివైపులా రాయాలి. దానిపైన కార్న్‌ఫ్లోర్ చల్లాలి. ఇప్పుడు దానిపై మరొక చపాతీని ఉంచి, మళ్లీ నూనె, కార్న్‌ఫ్లోర్ చల్లాలి. ఈ విధంగా ఐదు చపాతీలను ఒకదానిపై ఒకటి పేర్చాలి. చివరి చపాతీ వేసిన తర్వాత చేతితో తేలికగా నొక్కాలి. పైన కొద్దిగా నూనె రాసి, ఇప్పుడు గట్టిగా రోల్ చేసుకోవాలి. రోల్ చివరలో కొద్దిగా నీరు అద్ది గట్టిగా అతికించాలి, ఇది రోల్ విడిపోకుండా చేస్తుంది.

రోల్ చేసిన పిండిని తేలికగా నొక్కాలి. అంచులు కట్ చేసి పక్కన పెట్టాలి. రోల్‌ను సమాన పరిమాణంలో ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒక్కో కాజా ముక్కను అరచేతిలో పెట్టి తేలికగా నొక్కాలి. తర్వాత చపాతీ కర్రతో రెండు మూడు సార్లు సున్నితంగా రోల్ చేయాలి. మరీ గట్టిగా నొక్కకూడదు. ఇలా చేసిన కాజాలు ఆరిపోకుండా పైన ఒక తడి బట్ట కప్పి ఉంచాలి. డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నూనెను ఒక కడాయిలో పోసి తక్కువ మంటపై వేడి చేయాలి. నూనె ఎక్కువ వేడిగా ఉండకూడదు మంటను లో ఫ్లేమ్‌లో ఉంచి, నూనెకు సరిపడా కాజాలను వేయాలి. కాజాలు నెమ్మదిగా పైకి తేలే వరకు తక్కువ మంటపైనే వేయించాలి.

ఇలా చేయడం వల్ల పొరలు బాగా విచ్చుకుంటాయి. అన్నీ పైకి తేలిన తర్వాత, మంటను మీడియంలో పెట్టి, కాజాలు బంగారు గోధుమ రంగు వచ్చేవరకు అటు ఇటు తిప్పుకుంటూ వేయించాలి. వేయించిన కాజాలను నూనెలోంచి తీసేటప్పుడు మంటను ఆపివేయాలి. వేడిగా ఉన్న కాజాలను కొంచెం వెచ్చగా ఉన్న పంచదార పాకంలో వేయాలి. పాకం చల్లగా ఉంటే లోపలికి వెళ్లదు. కాజాలు పాకంలో మునిగేలా గరిటతో తేలికగా నొక్కాలి. ఒక నిమిషం పాటు పాకంలో ఉంచి తీసేయాలి. ఎక్కువ సేపు ఉంచితే మెత్తగా అయిపోతాయి. ఇలా అన్ని కాజాలను వేయించి, పాకంలో ముంచి తీసి ఒక ప్లేట్లో సర్దుకోవాలి. ఈ చిట్కాలు, పద్ధతులు పాటిస్తే క్రిస్పీగా, జ్యూసీగా, రుచికరమైన మడత కాజాలను ఇంట్లోనే సులభంగా తయారుచేసుకోవచ్చు.