
మనకు మార్కెట్‌లో ఎక్కువగా దొరికే ఆకుకూరల్లో పాలకూర ఒకటి. ఇది మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో మన శరీరానికి కావాల్సిన ఐరన్, ఫైబర్, విటమిన్-ఎ, విటమిన్-సి, ఫోలేట్, కాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అయితే మార్కెట్ నుంచి తెచ్చిన పాలకూర ఎక్కువ రోజులు ఫ్రెష్‌గా ఉండాలంటే.. మీరు మొదట కొనేప్పుడే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, తర్వాత దాన్ని ఎలా స్టోర్ చేస్తున్నారనేది కూడా చాలా ముఖ్యం.

కాబట్టి మీరు మార్కెట్‌లో ఆకుకూరను కొనేప్పుడే అది నాణ్యమైనదా కాదా అని చూడాలి. ఎప్పుడూ మచ్చలు లేని ముదురు ఆకుపచ్చ రంగులో, తాజాగా కనిపించే కట్టలను మాత్రమే కొనుగోలు చేయాలి. ఆకు కాస్త పసుపు రంగులో కనిపించినా, వాడిపోయినట్టు అనిపించినా అలాంటి వాటిని అస్సలు కొనకండి. ఎందుకంటే అవి త్వరగా పాడైపోయే అవకాశం ఉంటుంది. అలాగే ఇంటికి తెచ్చిన వెంటనే దాన్ని కడిగి నేరుగా ఫ్రిజ్‌లో పెట్టవద్దు. ఇలా చేయడం వల్ల ఆకుల మధ్య తేమ అలాగే ఉండి అది కుళ్లిపోయే ప్రమాదం ఉంటుంది.

ఒకవేళ మీరు ఫ్రిజ్‌లో పెట్టాలి అనుకుంటే.. పాలకూరను కడిగిన తర్వాత అది పూర్తిగా ఆరిపోయిన తర్వాత మాత్రమే ఫ్రిజ్‌లో పెట్టండి. లేదంటే గది ఉష్ణోగ్రత వద్ద కాసేపు ఉంచి దానిపై ఉన్న తేమ తొలగిపోయిన తర్వాత ఫ్రిజ్‌లో ఉంచండి. ఇలా చేయడం వల్ల పాలకూర ఎక్కువ రోజులు ఫ్రెష్‌గా ఉంటుంది. అలాగే పాలకూరను నేరుగా స్టోర్ చేయకుండా దానిని ఏదైనా కాటన్ గుడ్డలో చుట్టి పెట్టడం మంచిది.

అయితే మీరు పాలకూరను మార్కెట్ నుంచి తెచ్చిన వెంటనే మొదటగా అందులో ఏవైనా కుళ్లిపోయినా, లేదా పాడైపోయినా, పండిపోయిన ఆకులు ఉంటే వెంటనే వాటిని తొలగించండి. లేదంటే ఆ చెడిపోయిన ఆకులు మిగతా కూరను మొత్తం పాడు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు పాలకూర నిల్వ చేసే ముందు ఆకుల మొత్తాన్ని పూర్తిగా ఒకసారి పరిశీలించండి. అలాగే పాలకూరను ఆపిల్, అరటి, బేరి వంటి పండ్లతో కలిపి ఎప్పుడూ పెట్టవద్దు. ఈ పండ్ల నుంచి రిలీజ్ అయ్యే ఇథిలీన్ కారణంగా ఆకుకూరలు త్వరగా వాడిపోతాయి.

కాబట్టి మీ ఫ్రిజ్‌లో పండ్లు ఉంటే ఆ డ్రాయర్‌లో ఎప్పుడూ ఆకుకూరలను ఉంచకండి. అలాగే పాలకూరను ఎప్పుడూ ప్లాస్టిక్ కవర్‌లో బిగిగా మూసి పెట్టవద్దు. ఇలా చేయడం వల్ల లోపల తేమ పేరుకుపోయి ఆకులు త్వరగా కుళ్లిపోతాయి. కాబట్టి గాలి ఆడేలా టవల్ లేదా కాటన్ క్లాత్‌లో ఉంచండి. ఈ కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా మీరు వారం రోజులైనా సరే పాలకూరను ఫ్రెష్‌గా ఉంచుకోవచ్చు.