
ముందుగా ఒక గిన్నెలో రెండు బియ్యాన్ని తీసుకొని, రెండు సార్లు కడిగి అరగంట నుంచి గంటపాటు నానబెట్టాలి. బియ్యం బాగా నానిన తర్వాత నీళ్ళు వంపేసి, మిక్సీ జార్లో వేసుకోవాలి. ముందు నీళ్లు పోయకుండా గ్రైండ్ చేసి, ఆ తర్వాత మధ్య మధ్యలో కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మరీ మెత్తగా కాకుండా రవ్వ రవ్వగా ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న బియ్యం పేస్ట్‌ను పక్కన పెట్టుకోండి.

అదే మిక్సీ జార్లో ముప్పావు కప్పు పచ్చి కొబ్బరి ముక్కలువేసి, మధ్య మధ్యలో కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ కొబ్బరి పేస్ట్‌ను కూడా పక్కన పెట్టుకోండి. బియ్యం గ్రైండ్ చేయడానికి పావు కప్పు నీళ్లు, కొబ్బరి గ్రైండ్ చేయడానికి పావు కప్పు నీళ్లు తీసుకోండి.

ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి, ముప్పావు కప్పు బెల్లం తురుము, పావు కప్పు నీళ్ళు పోసి బెల్లాన్ని కరిగించుకోవాలి. పాకం రానవసరం లేదు, బెల్లం కరిగితే సరిపోతుంది. స్వీట్ ఎక్కువ తినేవారు ఒక కప్పు బెల్లం వాడుకోవచ్చు. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత, రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్‌లో ఉడికించి స్టవ్ ఆఫ్ చేసి, ఈ బెల్లం నీళ్ళను పూర్తిగా చల్లారనివ్వాలి.

అడుగు మందంగా ఉన్న గిన్నె లేదా పాన్‌ను స్టవ్ పైన పెట్టి, అర లీటరు చిక్కటి పాలు పోసుకోవాలి. పాలు పొంగిపోకుండా, అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ మీడియం ఫ్లేమ్‌లో కాగనివ్వాలి. పాలు మరుగుతున్నప్పుడు, ముందుగా గ్రైండ్ చేసుకున్న బియ్యం పేస్ట్‌ను ఒకసారి బాగా కలుపుకొని, మరుగుతున్న పాలలో వేసి వెంటనే ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. ఈ పేస్ట్ వేసిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు ఇలాగే కలుపుతూ ఉండాలి. అంచులకి పట్టిన మీగడను కూడా ఎప్పటికప్పుడు తీసి పాలలో కలుపుకోవాలి. బియ్యం పేస్ట్ ఉడికేంత వరకు లో-మీడియం ఫ్లేమ్‌లో మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి.

బియ్యం పేస్ట్ ఉడికిన తర్వాత, గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి పేస్ట్‌ను పాయసంలో వేసి బాగా కలపాలి. మంచి సువాసన కోసం రెండు మూడు యాలకులను మెత్తగా దంచి పొడిని కూడా పాయసంలో వేసి కలపాలి. ఇది కొంచెం దగ్గర పడేంత వరకు లో-మీడియం ఫ్లేమ్‌లో మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. పాయసం మరీ చిక్కగా కాకుండా, కావలసిన కన్సిస్టెన్సీకి రాగానే స్టవ్ ఆఫ్ చేయాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత, పూర్తిగా చల్లారిన బెల్లం సిరప్‌ను వడకట్టి పాయసంలో పోసి బాగా కలపాలి. ఇలా చల్లారిన బెల్లం సిరప్ కలపడం వల్ల పాలు విరిగిపోకుండా పాయసం చక్కగా వస్తుంది. ఒకవేళ మీరు పంచదార వాడాలనుకుంటే, అర కప్పు పంచదారను నేరుగా పాయసంలో కలుపుకోవచ్చు.