
కావలసిన పదార్థాలు: సుమారు 8 గారెలకు సరిపడా అర కప్పు మినపగుళ్లు, 1 కప్పు నిండుగా సన్నగా తురిమిన బెల్లం, బెల్లం పాకం కోసం 1 కప్పు నీళ్లు, 3 తొక్క తీసి గింజలు చితగ్గొట్టిన యాలకులు, పావు టీస్పూన్ ఉప్పు, 2 నుండి 3 చిటికెల వంట సోడా, పప్పు రుబ్బడానికి కొద్దిగా చల్లటి ఫ్రిజ్ వాటర్, డీప్ ఫ్రైకి సరిపడా – వంట నూనె. గమనిక: మీకు సర్వ్ చేసేటప్పుడు గారెలపై ఇంకాస్త జ్యూస్ పోసుకోవాలనుకుంటే బెల్లం ఒకటిన్నర కప్పు, నీళ్లు ఒకటిన్నర కప్పులు తీసుకోవచ్చు.

తయారీ విధానం: అర కప్పు మినపగుళ్లను శుభ్రంగా కడిగి 4 గంటల పాటు నీటిలో నానబెట్టుకోవాలి. నానిన పప్పును జాలి గిన్నెలో వేసి 10-15 నిమిషాలు నీరంతా వాడేలా పక్కన పెట్టాలి. ఇప్పుడు స్టవ్‌పై గిన్నె పెట్టి 1 కప్పు తురిమిన బెల్లం, 1 కప్పు నీళ్లు పోసి కరిగించాలి. బెల్లం కరిగాక నలకలు లేకుండా వడకట్టి.. అందులో 3 దంచిన యాలకుల గింజలు వేయాలి. లో-మీడియం మంటపై 2 నుండి 3 నిమిషాలు బెల్లం పచ్చివాసన పోయేలా మరిగించి స్టవ్ ఆఫ్ చేసి మూతపెట్టి పక్కన ఉంచాలి. ఎలాంటి ముదురు పాకం అవసరం లేదు.

మిక్సీ జార్లో వడకట్టిన మినప్పప్పు వేసి.. ఫ్రిజ్ లోని చల్లటి నీళ్లను కొద్దికొద్దిగా చిలకరిస్తూ మరీ లూజ్ కాకుండా, కొద్దిగా గట్టిగా ఉండేలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పిండిని బౌల్లోకి తీసుకుని పావు టీస్పూన్ ఉప్పు, 2-3 చిటికెల వంటసోడా వేసి.. వాటిపై ఒక స్పూన్ నీళ్లు పోసి పిండిలో సమంగా కలిసేలా కలుపుకోవాలి. సోడా వేసాం కాబట్టి ఎక్కువసేపు పిండిని బీట్ చేయక్కర్లేదు.

స్టవ్‌పై కడాయి పెట్టి నూనె వేడిచేయాలి. చేతిని నీటితో తడుపుకుని కొద్దిగా పిండి ముద్దను తీసుకుని మధ్యలో రంధ్రం పెట్టి కాగిన నూనెలో వేయాలి. పాకం గారెలు కాబట్టి మరీ పెద్దవి కాకుండా కాస్త చిన్న సైజులో వేసుకుంటే లోపలికి పాకం బాగా వెళ్తుంది. మీడియం ఫ్లేమ్‌పై గారెలని అటు ఇటు తిప్పుతూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి.

గారెలు వేగే లోపు పక్క స్టవ్‌పై ముందుగా సిద్ధం చేసుకున్న బెల్లం పాకాన్ని మళ్లీ వేడిచేయాలి. నూనెలోంచి తీసిన వేడివేడి గారెలను నేరుగా వేడి బెల్లం పాకంలో వేసి ఒకసారి తిరగేసి మూతపెట్టాలి. 10 నుండి 15 నిమిషాల పాటు గారెలు పాకాన్ని పూర్తిగా పీల్చుకునే వరకు నాననిచ్చి ప్లేట్లోకి తీసుకోవాలి. రెండో వాయి గారెలు వేసేటప్పుడు కూడా పాకాన్ని మళ్లీ కొద్దిగా వేడి చేసుకుని వేయాలి. అంతే, నోరూరించే జ్యూసీ జ్యూసీ 'పాకం గారెలు' సిద్ధం! పూజల వేళల్లో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా స్వీకరిస్తే బెల్లం, యాలకుల సువాసనతో అమృతతుల్యంగా ఉంటాయి!