
జీలకర్ర కేవలం రుచి కోసమే కాదు, అది రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. జీలకర్రలోని థైమోక్వినోన్, క్యూమినాల్డిహైడ్ అనే సమ్మేళనాలు క్లోమాన్ని ఉత్తేజపరిచి, సహజంగా ఇన్సులిన్ ఉత్పత్తి పెరిగేలా చేస్తాయి. మూడు నెలల సగటు చక్కెర స్థాయిని తగ్గించడంలో జీలకర్ర నీరు తిరుగులేని ఫలితాలను ఇస్తుందని ప్రయోగశాల పరీక్షల్లో తేలింది. ఇది మనం తిన్న ఆహారం నుంచి చక్కెర అకస్మాత్తుగా రక్తంలో కలవకుండా నియంత్రిస్తుంది.

మరోవైపు సోంపు నేరుగా కాకుండా పరోక్షంగా రక్తంలోని చక్కెర స్థాయిలపై ప్రభావం చూపుతుంది. శరీరంలోని అంతర్గత మంట వల్ల ఇన్సులిన్ నిరోధకత పెరుగుతుంది. సోంపులోని అనెథోల్ ఈ మంటను తగ్గించి కణాలు ఇన్సులిన్‌ను గ్రహించేలా చేస్తుంది. సోంపు నీరు తాగడం వల్ల మాటిమాటికీ ఆకలి వేయడం, తీపి పదార్థాల మీద కోరిక కలగడం తగ్గుతుంది. దీనివల్ల బరువు అదుపులో ఉండి మధుమేహం నియంత్రణ సులభమవుతుంది.

శాస్త్రీయంగా చూస్తే.. రక్తంలోని చక్కెర స్థాయిలను నేరుగా తగ్గించడంలో జీలకర్ర నీరు సోంపు కంటే ఎక్కువ ప్రభావవంతంగా ఉంటుంది. ఇది నేరుగా జీవక్రియ మార్గంపై ప్రభావం చూపి, గ్లూకోజ్ స్థాయిలను అదుపు చేస్తుంది. అయితే ఎసిడిటీ సమస్యలు ఉన్నవారికి సోంపు నీరు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ఇది కడుపును చల్లబరచడమే కాకుండా శరీరం నుండి విష పదార్థాలను తొలగించడంలో సహాయపడి పరోక్షంగా చక్కెర స్థాయిలను క్రమబద్ధీకరిస్తుంది.

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ రెండింటి మధ్య సమతుల్యత పాటించడం మంచిది. జీవక్రియను పెంచుకోవడానికి ఉదయాన్నే పరగడుపున జీలకర్ర నీరు తాగడం ప్రయోజనకరం. అలాగే రోజంతా అలసట నుండి ఉపశమనం పొందడానికి లేదా భారీ భోజనం తర్వాత చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరగకుండా నివారించడానికి సోంపు నీటిని కొద్దికొద్దిగా సేవించడం మంచి ఫలితాలను ఇస్తుంది.

సీజన్స్ బట్టి కూడా వీటి వినియోగంలో మార్పులు చేసుకోవాలి. ఎండాకాలంలో శరీరాన్ని చల్లబరిచే గుణం ఉన్న సోంపు నీరు ఉత్తమమైన ఎంపిక, ఇది ఎసిడిటీని కూడా తగ్గిస్తుంది. వర్షాకాలం లేదా చలికాలంలో రోగనిరోధక శక్తిని పెంచే జీలకర్ర నీరు శరీరాన్ని వెచ్చగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. మధుమేహం నియంత్రణలో ఇవి కీలక పాత్ర పోషించినప్పటికీ, ఏదైనా కొత్త అలవాటును ప్రారంభించే ముందు మీ శరీర తత్వాన్ని బట్టి వైద్యుడిని సంప్రదించడం మర్చిపోవద్దు.