
రాత్రివేళ 7 నుండి 8 గంటల నిద్ర ఎంత ముఖ్యమో, మధ్యాహ్నం కొద్దిసేపు నిద్రపోవడం కూడా అంత ప్రయోజనకరమని పరిశోధనలు చెబుతున్నాయి. రోజంతా పనిచేసిన తర్వాత మధ్యాహ్నం కాసేపు అలసటగా అనిపించడం సర్వసాధారణం. నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మాటిక్స్ అధ్యయనం ప్రకారం... సరైన సమయంలో, సరైన వ్యవధిలో మధ్యాహ్నం నిద్రపోవడం వల్ల శరీరం, మెదడు రీఫ్రెష్ అవుతాయి. కేవలం 10 నుండి 20 నిమిషాల పవర్ నాప్ వల్ల లాభనష్టాలేంటో ఇప్పుడు చూద్దాం..

పరిశోధనలు ఏం చెబుతున్నాయి?: నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ నివేదిక ప్రకారం, మధ్యాహ్న సమయంలో సరైన ప్రమాణంలో నిద్రపోవడం వల్ల శరీరానికి, మెదడుకు ఎంతో మేలు జరుగుతుంది. రోజువారీ అలసటను తొలగించి శక్తిని పునరుద్ధరించడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది.

10 నుండి 20 నిమిషాల పవర్ నాప్ ప్రయోజనాలు: పరిశోధనల ప్రకారం, మధ్యాహ్నం 10 నుండి 20 నిమిషాల పాటు చిన్న కునుకు (Power Nap) తీయడం వల్ల శారీరక అలసట, మానసిక ఒత్తిడి తక్షణమే తగ్గుతాయి. మెదడు చురుగ్గా మారి, పనిలో ఏకాగ్రత, ఉత్పాదకత పెరుగుతాయి. మానసిక స్థితి మెరుగుపడుతుంది.

ఎంతసేపు నిద్రపోవడం సురక్షితం?: మధ్యాహ్న నిద్ర 30 నిమిషాల కంటే తక్కువగా ఉన్నప్పుడే గరిష్ఠ ప్రయోజనాలు లభిస్తాయి. ఎందుకంటే, తక్కువ సమయంలో నిద్రపోవడం వల్ల శరీరం ప్రశాంతపడుతుంది. కానీ, గాఢ నిద్ర స్థితికి వెళ్లదు. దీనివల్ల నిద్రలేచిన వెంటనే శరీరం సులువుగా ఉత్తేజితమవుతుంది.

ఎక్కువ సమయం నిద్రపోతే జరిగే నష్టాలు: ఒకవేళ మీరు మధ్యాహ్నం 90 నిమిషాలు లేదా అంతకంటే ఎక్కువ సేపు నిద్రపోతే ప్రయోజనాల కంటే నష్టాలే ఎక్కువ. గాఢ నిద్ర నుండి ఒక్కసారిగా లేవడం వల్ల మెదడు మొద్దుబారినట్లు అనిపిస్తుంది, తలనొప్పి, రోజంతా బద్ధకం ఆవహిస్తాయి. అలాగే, మధ్యాహ్నం ఎక్కువసేపు నిద్రపోవడం వల్ల రాత్రివేళల్లో సరైన సమయానికి నిద్రపట్టక నిద్రలేమి సమస్యకు దారితీస్తుంది. మధ్యాహ్న నిద్ర మంచిదే, కానీ అది కేవలం 10 నుండి 20 నిమిషాల 'పవర్ నాప్'గా ఉన్నంతవరకే! మీ రోజువారీ దినచర్యలో ఈ చిన్న కునుకును భాగం చేసుకోవడం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉండవచ్చు.