
పప్పుగుత్తితో లేదా గరిటెతో మెదిపి, తాజా ఆవ-మెంతుల పొడి వేసి నూనెలో మగ్గించే ఈ విలేజ్ స్టైల్ టమోటా పచ్చడి తయారీ విధానాన్ని ఇప్పుడు వివరంగా చూద్దాం. దీనికి కావలసిన పదార్థాలు: అర కిలో నుండి ముప్పావు కిలో మంచి ఎర్రటి గట్టి టమోటాలు, నిమ్మకాయ సైజు అంత - పీచు, గింజలు తీసిన చింతపండు, 3 నుండి 4 టేబుల్ స్పూన్ల కారం , అర టీస్పూన్ పసుపు , రుచికి సరిపడా ఉప్పు, ఆవాలు, దోరగా వేయించి పొడి చేయడానికి మెంతులు, తాలింపుకు సరిపడా నూనె, ఇంగువ, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు మరియు కరివేపాకు.

టమోటా మిశ్రమం ఉడికించే విధానం: ముందుగా టమోటాలను శుభ్రంగా కడిగి తడి ఏమాత్రం లేకుండా తుడుచుకోవాలి. తొడిమ భాగాన్ని తీసేసి మీడియం సైజు ముక్కలుగా తరగాలి. స్టవ్ మీద గిన్నె పెట్టి తరిగిన టమోటా ముక్కలు, చింతపండు, రెండు టేబుల్ స్పూన్ల ఉప్పు, కొద్దిగా పసుపు మరియు రెండు టేబుల్ స్పూన్ల నూనె వేయాలి ఇక్కడ ముఖ్య గమనిక నీళ్లు అస్సలు పోయకూడదు.

మూతపెట్టి మీడియం మంటపై టమోటాలు మెత్తబడే వరకు మధ్యమధ్యలో కలుపుతూ 6 నుండి 8 నిమిషాలు మగ్గనివ్వాలి. టమోటా బాగా ఉడికిన తర్వాత 3 స్పూన్ల కారం వేసి కలిపి, పచ్చివాసన పోయే వరకు చిన్న మంటపై మరో రెండు నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని మిక్సీలో వేయకుండా, పప్పుగుత్తితో లేదా ముద్దకవ్వంతో కాస్త బరకగా ఉండేలా మెదుపుకోవాలి అయితే ఇక్కడ మిక్సీ పడితే పేస్ట్‌లా మారి పచ్చడి రుచి తగ్గుతుంది.

ఆవ-మెంతుల పొడి, తాలింపు విధానం: పాన్‌లో కొద్దిగా ఆవాలు, మెంతులు వేసి దోరగా వేయించి పొడి చేసుకోవాలి. ఇప్పుడు పాన్‌లో పచ్చడికి సరిపడా నూనె వేసి వేడిచేయాలి. అందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, దంచిన వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, చిటికెడు ఇంగువ వేసి దోరగా వేయించాలి.

తాలింపు వేగిన తర్వాత మెదిపి పెట్టుకున్న టమోటా-చింతపండు గుజ్జును ఇందులో వేసి నూనెలో బాగా కలపాలి. ఆ వెంటనే వేయించి పొడి చేసి పెట్టుకున్న ఆవాలు-మెంతుల పొడిని వేసి, మంటను లో ఫ్లేమ్‌లో ఉంచి 3 నుండి 4 నిమిషాల పాటు నూనె పైకి తేలే వరకు బాగా మగ్గించి స్టవ్ ఆఫ్ చేయాలి. పూర్తిగా చల్లారిన తర్వాత తడిలేని గాజు సీసాలో భద్రపరుచుకుంటే నెల రోజుల పాటు తాజాగా ఉంటుంది. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తిన్నా, లేదా ఇడ్లీ, దోశ, చపాతీల్లోకి నంజుకున్నా ఈ పచ్చడి రుచికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే!