
కావలసిన పదార్థాలు: అర లీటర్(500 ml) పచ్చి పాలు, 1 ప్యాకెట్ సుమారు 100 గ్రాముల జున్ను పౌడర్, 150 గ్రాముల సన్నగా తురిమిన బెల్లం, అర టీస్పూన్ నల్ల మిరియాల పొడి, పావు టీస్పూన్ యాలకుల పొడి, 2 పెద్ద గ్లాసుల నీళ్లు. గమనిక: బెల్లం ఇష్టం లేని వారు బెల్లానికి బదులుగా 150 గ్రాముల పంచదారను కూడా వాడుకోవచ్చు.

తయారీ విధానం: ఒక వెడల్పాటి గిన్నెలోకి కాచని పచ్చి చిక్కటి గేదె పాలను అర లీటర్ తీసుకోవాలి. పాలు ఏమాత్రం వేడిగా ఉండకూడదు. ఇందులో 150 గ్రాముల సన్నగా తురిమిన బెల్లాన్ని వేయాలి. అలాగే 1 ప్యాకెట్ జున్ను పౌడర్ వేయాలి. చేత్తో లేదా విస్కర్ సహాయంతో బెల్లం మరియు జున్ను పొడి పాలలో పూర్తిగా కరిగిపోయేంత వరకు 5 నుండి 10 నిమిషాలు కలపాలి.

బెల్లంలో ఏమైనా నలకలు ఉన్నాయనిపిస్తే ఈ పాలను టీ స్ట్రైనర్ సహాయంతో వేరొక స్టీల్ గిన్నె లేదా టిఫిన్ బాక్స్‌లోకి వడకట్టుకోవాలి.కరిగించిన జున్ను పాల మిశ్రమంలో అర టీస్పూన్ మిరియాల పొడి, పావు టీస్పూన్ యాలకుల పొడి వేసి గరిటెతో బాగా కలపాలి. మిరియాల ఘాటు, యాలకుల సువాసన వల్లే అసలైన జున్ను ఫ్లేవర్ వస్తుంది.

స్టవ్‌పై ఒక పెద్ద గిన్నె లేదా ఇడ్లీ పాత్ర పెట్టి 2 గ్లాసుల నీళ్లు పోసి అడుగున రింగ్ లేదా స్టాండ్ పెట్టాలి. నీరు వేడెక్కుతున్నప్పుడు.. జున్ను పాల మిశ్రమం ఉన్న గిన్నెను స్టాండ్‌పై భద్రంగా ఉంచాలి. ఆవిరి నీళ్లు జున్ను పాలల్లో పడకుండా జున్ను గిన్నెపై చిన్న ప్లేట్ లేదా మూత పెట్టాలి. ఆ తర్వాత పాత్రపై ప్రధాన మూతపెట్టి లాక్ చేయాలి.మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి సరిగ్గా 15 నిమిషాల పాటు ఆవిరిపై ఉడికించాలి. కుక్కర్లో అయితే విజిల్ పెట్టకుండా మూతపెట్టాలి.

15 నిమిషాల తర్వాత మూత తీసి.. ఒక చాకు లేదా టూత్‌పిక్‌ను జున్ను మధ్యలోకి గుచ్చి చూడాలి. చాకుకి తడి లేదా పాలు అంటుకోకుండా క్లీన్‌గా వస్తే జున్ను పర్ఫెక్ట్గా ఉడికినట్లు. ఒకవేళ ఏమైనా పాలు అంటుకుంటే మరో 5 నిమిషాలు ఉడికించాలి.గిన్నెను బయటకు తీసి గది ఉష్ణోగ్రత వద్ద పూర్తిగా చల్లారనివ్వాలి. ఆ తర్వాత ఫ్రిజ్‌లో 2 నుండి 3 గంటల పాటు ఉంచితే జున్ను ఇంకా గట్టిపడి గడ్డలా మారుతుంది. చాకుతో అంచుల వెంట విడిపించి ప్లేట్లోకి తిరగేస్తే ముక్క చెదరకుండా పర్ఫెక్ట్ కేక్‌లా బయటకు వస్తుంది.అంతే, నోరూరించే అచ్చమైన 'గడ్డ జున్ను' సిద్ధం! చల్లగా ఉన్నప్పుడే ముక్కలుగా కోసి తింటుంటే మిరియాల ఘాటు, బెల్లం తీపితో నోట్లో అలా వెన్నలా కరిగిపోతూ అమృతతుల్యమైన అనుభూతినిస్తుంది!