
కావలసిన పదార్థాలు: 1 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు, అర కప్పు నుండి ముప్పావు కప్పు తురిమిన బెల్లం, 1 టేబుల్ స్పూన్ పెసరపప్పు, 1 టేబుల్ స్పూన్ బియ్యం, 3 నుండి 4 టేబుల్ స్పూన్ల స్వచ్ఛమైన నెయ్యి , 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు ముక్కలు, 2 టేబుల్ స్పూన్ల సన్నగా తరిగిన పచ్చి లేదా ఎండు కొబ్బరి ముక్కలు, అర టీస్పూన్ యాలకుల పొడి, పావు కప్పు నీళ్లు

తయారీ విధానం: స్టవ్‌పై పాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ పెసరపప్పు, 1 టేబుల్ స్పూన్ బియ్యం వేయాలి. మంటను పూర్తిగా సన్నటి సెగపై ఉంచి గరిటెతో కలుపుతూ మాడిపోకుండా దోరగా వేయించాలి. లైట్ గా రంగు మారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన వీటిని చిన్న మిక్సీ జార్‌లో వేసి ఏమాత్రం పలుకు లేకుండా చాలా మెత్తటి ఫైన్ పౌడర్‌లా గ్రైండ్ చేసుకోవాలి.

గ్రైండ్ చేసుకున్న పొడి ఉన్న మిక్సీ జార్‌లోనే.. వెనుక బ్రౌన్ పార్ట్ తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసిన 1 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలను వేయాలి. ఇందులో అర నుండి ముప్పావు కప్పు తురిమిన బెల్లం, పావు కప్పు నీళ్లు పోయాలి. మిక్సీని మెత్తగా తిప్పి అచ్చం వెన్న ముద్దలాంటి నునుపైన పేస్ట్‌లా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి.స్టవ్‌పై పాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి వేడిచేయాలి. నెయ్యి కరిగాక 2 టేబుల్ స్పూన్ల చిన్న జీడిపప్పు ముక్కలు, 2 టేబుల్ స్పూన్ల సన్నగా తరిగిన కొబ్బరి ముక్కలు వేయాలి. చిన్న మంటపై రెండూ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు దోరగా వేయించి ఒక చిన్న గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి.

పాన్‌లోని మిగిలిన నేతిలోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి-బెల్లం పేస్ట్ మొత్తాన్ని వేయాలి. మంటను లో-మీడియం ఫ్లేమ్‌లో ఉంచి గరిటెతో అడుగు పట్టకుండా కంటిన్యూస్‌గా కలుపుతూ ఉడికించాలి.ఉడుకుతున్న సమయంలో మధ్యమధ్యలో అర చెంచాడు చొప్పున నెయ్యిని వేస్తూ ఉండాలి. మొత్తంగా 3 నుండి 4 టేబుల్ స్పూన్ల నెయ్యి పడుతుంది. సుమారు 15 నిమిషాల పాటు నిదానంగా ఉడికిస్తే.. హల్వా చిక్కబడి ముద్దలా దగ్గరకు వస్తూ అంచుల నుండి నెయ్యిని వదలడం ప్రారంభిస్తుంది.

హల్వా నుండి నెయ్యి సెపరేట్ అవుతున్న స్టేజ్‌లో.. ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కొబ్బరి ముక్కలను వేయాలి. అలాగే అర టీస్పూన్ యాలకుల పొడి వేసి అంతా కలిసేలా ఒక్కసారి బాగా తిప్పి వెంటనే స్టవ్ ఆఫ్ చేసి దింపేయాలి. అంతే, నోరూరించే కమ్మటి 'పచ్చి కొబ్బరి హల్వా' సిద్ధం! వేడివేడిగా తిన్నా లేదా గాలి చొరబడని డబ్బాలో పెట్టుకుని 2 నుండి 3 రోజుల పాటు నిల్వ చేసుకుని చల్లగా ఆరగించినా.. కొబ్బరి-బెల్లం-నేతి పరిమళంతో నోట్లో అమృతంలా కరిగిపోతూ ప్రతి ఒక్కరినీ మైమరిపిస్తుంది!