
అరకిలో బంగాళాదుంపలను కుక్కర్లో వేసి, మునిగేంత వరకు నీళ్లు పోసి, మీడియం ఫ్లేమ్‌లో ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించాలి. ఉడికిన తర్వాత పొట్టు తీసి, పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక మందపాటి కడాయిలో రెండు టేబుల్‌స్పూన్ల నూనె వేసి వేడిచేసి, కట్ చేసుకున్న బంగాళాదుంప ముక్కలను మీడియం నుండి హై ఫ్లేమ్‌లో బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. పైన ఒక క్రిస్పీ లేయర్ ఏర్పడిన తర్వాత, పావు టీస్పూన్ పసుపు, అర టీస్పూన్ ఉప్పు, అర టీస్పూన్ కారం వేసి రెండు నిమిషాలు వేయించి పక్కన పెట్టుకోవాలి.

రెండు అంగుళాల అల్లం, 10-12 వెల్లుల్లి రెబ్బలు, ఆరు పచ్చిమిర్చిలను కలిపి కొంచెం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. రెండు గ్లాసుల బాస్మతి బియ్యాన్ని శుభ్రంగా కడిగి అరగంట పాటు నీళ్లలో నానబెట్టుకోవాలి. ఒక పెద్ద గిన్నెలో 2 లీటర్ల నీళ్లు పోసి మరిగించాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు, ఒక టేబుల్‌స్పూన్ ఉప్పు, ఒక అంగుళం దాల్చిన చెక్క, రెండు యాలకులు, ఒక బిర్యానీ ఆకు, ఒక చీల్చిన పచ్చిమిర్చి, రెండు లేదా మూడు నిమ్మకాయ స్లైస్‌లు, రెండు టేబుల్‌స్పూన్ల తరిగిన కొత్తిమీర, పుదీనా, అర టేబుల్‌స్పూన్ నూనె వేసి కలపాలి. నానబెట్టిన బాస్మతి బియ్యాన్ని నీళ్లు లేకుండా వడకట్టి, మరుగుతున్న నీటిలో వేయాలి. బియ్యం ఉడికే వరకు మీడియం ఫ్లేమ్‌లో మధ్యమధ్యలో కలుపుతూ ఉడికించాలి. బియ్యం ఉడికిన తర్వాత, పైన తేలుతున్న మసాలాలను తీసివేసి, బియ్యాన్ని వడకట్టి, మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. నిమ్మకాయ వేయడం వల్ల అన్నం పొడిపొడిలాడుతూ తెల్లగా వస్తుంది.

బిర్యానీ తయారు చేసుకోవడానికి, ఒక బిర్యానీ పాట్‌లో నాలుగు నుండి ఐదు టేబుల్‌స్పూన్ల నూనె, ఒకటి లేదా రెండు టేబుల్‌స్పూన్ల నెయ్యి వేసి వేడి చేయాలి. నూనె వేడి అయిన తర్వాత, రెండు టేబుల్‌స్పూన్ల హోల్ బిర్యానీ మసాలా దినుసులు (దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, షాజీరా, లవంగాలు, యాలకులు, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, జాపత్రి) వేసి వేయించాలి. తరువాత ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్‌ను వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి.

రెండు మీడియం సైజు టమాటాలను స్లైస్‌లుగా కట్ చేసి వేసి మగ్గించాలి. టమాటాలు మగ్గుతున్నప్పుడు పావు కప్పు పెరుగు వేసి, టమాటాలు సాఫ్ట్‌గా అయ్యే వరకు వేయించాలి. పావు టీస్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, ఒకటిన్నర టీస్పూన్ కారం, ఒక టీస్పూన్ క్రష్ చేసిన కసూరి మేతి, రెండు టేబుల్‌స్పూన్ల తరిగిన కొత్తిమీర, పుదీనా, ఒక టీస్పూన్ ధనియాల పొడి, అర టీస్పూన్ జీలకర్ర పొడి, ఒక టీస్పూన్ బిర్యానీ మసాలా పౌడర్ అర టీస్పూన్ యాలకుల పొడి వేసి బాగా కలపాలి. ఇందులోకి వన్ థర్డ్ కప్పు వేయించిన ఉల్లిపాయలు వేసి కలపాలి. తరువాత, ముందుగా వేయించి పెట్టుకున్న బంగాళాదుంప ముక్కలను వేసి, అర నిమిషం పాటు మసాలాతో కలిపి వేయించాలి. చివరగా, రెండు చీల్చిన పచ్చిమిర్చి, రెండు రెమ్మల కరివేపాకు వేసి మరో అర నిమిషం వేయించి, ఈ ఆలూ మసాలాను పాన్‌కు ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకోవాలి.

ఆలూ మసాలాపై తరిగిన పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ చల్లాలి. దీనిపైన ఉడికించిన బాస్మతి బియ్యాన్ని ఒక లేయర్‌గా వేయాలి. ఈ బియ్యంపై కూడా కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ చల్లాలి. మంచి దమ్ బిర్యానీ ఫ్లేవర్ కోసం, కుంకుమపువ్వును పాలల్లో నానబెట్టి, ఆ కుంకుమపువ్వు పాలను బియ్యంపై పోయాలి. ఒక టేబుల్‌స్పూన్ నెయ్యి, అర టీస్పూన్ కెవ్రా వాటర్ లేదా బిర్యానీ ఎసెన్స్ వేయాలి. బియ్యం 90% మాత్రమే ఉడికించారు కాబట్టి, పావు కప్పు నీటిని బియ్యంపై స్ప్రెడ్ చేయాలి. ఇప్పుడు, బియ్యం అడుగు భాగానికి అంటుకోకుండా ఉండటానికి టిష్యూ పేపర్‌ను ఉంచి, మూత పెట్టి 15-20 నిమిషాల పాటు తక్కువ మంటపై దమ్ చేయాలి. దమ్ చేసేటప్పుడు, అడుగున బంగాళాదుంపలు మాడకుండా ఉండటానికి ఒక ప్లేట్‌ను పాన్ కింద అరేంజ్ చేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత, స్టవ్ ఆపి, మూత తీయకుండా మరో 10 నిమిషాలు అలాగే ఉంచాలి. ఆ తర్వాత మూత తీసి సర్వ్ చేసుకోవచ్చు.