
ఇప్పుడిప్పుడే పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. విద్యార్ధులు పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. సమయం ఏ మాత్రం వృధా చేయకుండా లక్ష్య సాధన కోసం ఏకాగ్రతతో అహర్నిశలు కష్టపడుతున్నారు. అయితే లక్ష్యాన్ని నిర్దేశించుకుని దాని సాధన చేస్తున్న క్రమంలో కొన్నిసార్లు ఆటంకాలు ఎదురవుతుంటాయి.

వాటి నుంచి బయటపడటానికి ఎంతగానో కృషిచేసే విద్యార్థులు ఎందరో ఉంటారు. ఈ క్రమంలో చిన్న లక్ష్యాలనూ పెట్టుకోవాలి. అప్పుడే గమ్యాన్ని చేరుకోవడం సులువవుతుందని నిపుణులు సూచిస్తున్నారు. కోర్సులో చేరిన వెంటనే పెద్ద లక్ష్యాన్ని నిర్దేశించుకుని విద్యా సంవత్సరం చివరిలోగా దాన్ని సాధించేద్దామని ఊహించుకుంటే సరిపోదు. గమ్యాన్ని చేరుకునే ప్రయాణంలో మరికొన్ని చిన్న లక్ష్యాలూ అవసరం అవుతాయి.

వార్షిక పరీక్షల్లో మంచి మార్కులు సాధించమే మీ లక్ష్యమైతే అందుకు రోజువారీ స్టడీ ప్లాన్ తప్పనిసరిగా వేసుకోవాలి. ప్రతిరోజూ అందుకోసం ప్రతి సబ్జెక్టు చదవడానికీ సమయాన్ని కేటాయించాలి. ప్రణాళిక వేసుకోవడం, దాన్ని అమలుచేయడం రెండూ ముఖ్యమే. ఆచరించకపోతే కష్టపడినా ప్రయోజనం ఉండదు.

లక్ష్య సాధనలో సమయ పాలన ఎంతో ముఖ్యం. దీని కోసం ఉదయం త్వరగా నిద్రలేవాలనే చిన్న లక్ష్యాన్ని పెట్టుకోవాలి. ఇలాంటి చిన్న లక్ష్యాల వల్ల ఏడాది చివర్లో జరిగే పరీక్షల్లో ఎక్కువ మార్కులు సాధించలనే పెద్ద లక్ష్యం నెరవేరుతుంది. ఎప్పటి పనులను అప్పుడే పూర్తిచేసుకుంటే ఎంతో సమయం ఆదా అవుతుంది.

ఒక్కోసారి పుస్తకం మీద దృష్టిపెట్టాలని ఎంత ప్రయత్నం చేసినా వశం తప్పి ధ్యాస ఇట్టే మళ్లిపోతూ ఉంటుంది. పట్టుమని పది వాక్యాలో, పాఠమో ఏకబిగిన చదవలేకపోతున్నానే! అని దిగులు పట్టుకుంటుంది. చదువులో ఇలాంటివి అడపాదడపా తలెత్తుతూనే ఉంటాయి. ఇలాంటి సందర్భాల్లో జాగరూకతతో ఉండాలి. సందర్భం ఏదైనా అన్నివిధాలుగా అప్రమత్తతతో ఉంటే సహజంగానే ఏకాగ్రత బలపడుతుంది. అలాగే గతంలో కూరుకుపోకుండా, రేపటి ఊహల్లో తేలిపోకుండా వర్తమాన స్పృహతో మెలగాలి.