
వేసవి సెలవులు వచ్చాయంటే పిల్లలకు పండుగే. కానీ, తల్లిదండ్రులకు మాత్రం వారిని మొబైల్, టీవీల నుండి ఎలా దూరంగా ఉంచాలో అర్థం కాక సతమతమవుతుంటారు. గంటల తరబడి డిజిటల్ స్క్రీన్ల ముందు గడపడం వల్ల పిల్లల మానసిక, శారీరక ఎదుగుదలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అందుకే వారికి కొత్త హాబీలను ప్రోత్సహించండి. సెలవుల్లో పిల్లలకు ఇష్టమైన పెయింటింగ్, మ్యూజిక్, డాన్స్ లేదా ఏదైనా క్రీడ నేర్చుకునేలా సమ్మర్ క్యాంపుల్లో చేర్పించండి. ఇది వారిలో దాగి ఉన్న ప్రతిభను బయటకు తీయడమే కాకుండా స్క్రీన్ టైమ్‌ను తగ్గిస్తుంది.

పుస్తకాలు చవటం: పిల్లలకు బొమ్మల పుస్తకాలు లేదా స్ఫూర్తిదాయకమైన కథల పుస్తకాలను పరిచయం చేయండి. రోజులో కనీసం ఒక గంట పాటు పుస్తకాలు చదివే అలవాటు చేస్తే వారి ఊహాశక్తి, భాషా నైపుణ్యం మెరుగుపడతాయి.

ఇంటి పనుల్లో భాగస్వామ్యం: మొక్కలకు నీళ్లు పోయడం, గదిని సర్దుకోవడం లేదా వంటగదిలో చిన్న చిన్న సహాయాలు చేయడం వంటి పనులను పిల్లలకు అప్పగించండి. దీనివల్ల వారికి బాధ్యత తెలియడమే కాకుండా ఫోన్ వాడాలనే ఆలోచన రాదు.

బోర్డ్ గేమ్స్, అవుట్ డోర్ గేమ్స్: సాయంత్రం వేళల్లో క్యారమ్స్, చెస్ వంటి బోర్డ్ గేమ్స్ ఆడించండి. ఎండ తగ్గిన తర్వాత బయట స్నేహితులతో కలిసి ఆడుకునేలా ప్రోత్సహించండి. శారీరక శ్రమ వల్ల పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు.

తల్లిదండ్రుల పాత్ర: పిల్లలు ఎప్పుడూ పెద్దలను చూసే నేర్చుకుంటారు. మీరు వారి ముందు గంటల తరబడి ఫోన్ వాడుతూ, వారిని వద్దని చెబితే వారు వినరు. కాబట్టి, పిల్లలతో గడిపేటప్పుడు మీరు కూడా ఫోన్‌ను పక్కన పెట్టి వారితో కబుర్లు చెప్పడం లేదా కలిసి ఆడటం చేయండి.

డిజిటల్ ప్రపంచం నుండి పిల్లలను పూర్తిగా దూరం చేయడం సాధ్యం కాకపోవచ్చు. కానీ. దానిని పరిమితం చేయడం మన చేతుల్లోనే ఉంది. అన్నింటికంటే ముఖ్యంగా తల్లిదండ్రులు కూడా పిల్లల ముందు మొబైల్ వాడకాన్ని తగ్గించి వారికి ఆదర్శంగా ఉండాలి. ఈ చిట్కాలను పాటించడం ద్వారా ఈ వేసవిని మీ పిల్లలకు గుర్తుండిపోయేలా మార్చవచ్చు.