
ప్రపంచంలోనే అత్యధికంగా నిమ్మ పండించే దేశం భారతదేశం కాగా దేశంలోనే అగ్రస్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలుస్తోంది. గుజరాత్, మహారాష్ట్ర, యూపీ వంటి రాష్ట్రాల్లోనూ వీటి ఉత్పత్తి అధికం. ఇంతటి డిమాండ్ ఉన్న నిమ్మ మొక్కను చాలామంది ఇంట్లోని బాల్కనీల్లో లేదా టెర్రస్‌పై కుండీలలో పెంచుతుంటారు. అయితే తరచుగా పువ్వులు రాలిపోవడం, పూత నిలవకపోవడం, కాయలు చిన్నవిగా ఉండటం వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. అక్టోబర్ నెలలో నిమ్మ మొక్కకు తగిన పోషణ, కొన్ని సులభమైన ఇంటి చిట్కాలు అందిస్తే ఏడాది పొడవునా గుత్తులు గుత్తులుగా దిగుబడి సాధించవచ్చు.

మొక్క ఎంపిక - సరైన కుండీ సైజు: విత్తనాల ద్వారా పెరిగే నాటు మొక్కలు కాయలు కాయడానికి 5 నుంచి 10 ఏళ్లు పట్టవచ్చు. కాబట్టి నర్సరీల నుంచి గ్రాఫ్టింగ్ లేదా ఎయిర్ లేయరింగ్ చేసిన మొక్కలను ఎంచుకోవాలి. ఇవి 1-2 ఏళ్లలోనే కాపుకొస్తాయి. కొనుగోలు చేసేటప్పుడు మొక్కకు కనీసం ఆరు నెలల వయసు ఉండటంతో పాటు ఒకటి లేదా రెండు కాయలు ఉన్న మొక్కలను ఎంచుకోవడం మంచిది. కాక్స్కోంబ్ రకం నిమ్మ మొక్కలు కుండీలలో పెంచడానికి ఉత్తమమైనవి. కనీసం 18 అంగుళాల లోతు ఉండి, అడుగున నీరు సాఫీగా బయటకు పోయే డ్రైనేజీ రంధ్రాలు ఉన్న కుండీలను మాత్రమే వాడాలి.

నిమ్మ చెట్టు ఆరోగ్యంగా పెరగాలంటే రోజుకు కనీసం 7 నుంచి 8 గంటల పాటు నేరుగా ఎండ తగలాలి. మొక్క ఎదుగుదల సరిగ్గా లేకున్నా, వాడిపోయినట్లున్నా వెంటనే పెద్ద కుండీలోకి మార్చాలి. దెబ్బతిన్న, ఎండుకొమ్మలను కత్తిరించడం ద్వారా కొత్త చిగుళ్లు వేగంగా వస్తాయి. పూత రాలిపోవడాన్ని నివారించడానికి కాల్షియం అవసరం. ఒక లీటరు నీటిలో 1 గ్రాము తినే సున్నాన్ని బాగా కలిపి వేర్ల మొదట్లో పోయాలి. ఇది పూత, పిందె రాలడాన్ని అరికట్టడమే కాకుండా మట్టిలోని పురుగులు, ఫంగస్‌ను నశించేలా చేస్తుంది.

రసాయనాలు లేకుండా ఇంట్లోని వస్తువులతోనే అద్భుతమైన పోషక ద్రావణాలు తయారు చేసుకోవచ్చు. ఒక లీటరు నీటిలో చిన్న పటిక ముక్కను కరిగించి, దానికి రెండు చెంచాల తాజా టీ ఆకులు (లేదా టీ పొడి) కలపాలి. ఈ మిశ్రమం నేలలో నత్రజని అందించి, వేర్లను దృఢపరుస్తుంది. బంగాళదుంపను పేస్ట్‌లా చేసి లీటరు నీటిలో కలపాలి. దానికి 50 గ్రాముల బెల్లం జోడించి పులియబెట్టిన తర్వాత కుండీలో పోస్తే పొటాషియం, భాస్వరం, నత్రజని పుష్కలంగా లభించి కొత్త పూత బాగా వస్తుంది.

ప్రతి 20-25 రోజులకు ఒకసారి మొక్క మొదట్లో కలుపు మొక్కలను తొలగించి, మట్టిని గుల్ల చేయాలి. ఆపై ఈ క్రింది సహజ ఎరువుల మిశ్రమాన్ని అందించాలి. ఇందుకోసం 100 గ్రాముల వేప పిండి, కొద్దిగా ఆవాల పిండి, 100 గ్రాముల వర్మీకంపోస్ట్, సహజ పొటాష్, 2 టేబుల్ స్పూన్ల హ్యూమిక్ యాసిడ్, 2 టేబుల్ స్పూన్ల సీవీడ్ గ్రాన్యూల్స్ వంటి పదార్థాలు అవసరమవుతాయి. ఈ పదార్థాలన్నింటినీ కలిపి మొక్క కాండానికి కొద్దిగా దూరంగా మట్టిలో వేసి, పైన మట్టితో కప్పేయాలి. ఆ వెంటనే కుండీ నిండా సమృద్ధిగా నీరు పోయాలి. మార్కెట్లో లభించే సముద్రపు పాచి లిక్విడ్‌ను కూడా పిచికారీ చేయడం వల్ల పూత, పిందె రాలకుండా నిమ్మకాయల పరిమాణం పెద్దదిగా పెరుగుతుంది. సరైన సమయంలో ఈ సహజ సంరక్షణ పద్ధతులు పాటిస్తే కుండీలోనే గుత్తులు గుత్తులుగా నిమ్మకాయలను దిగుబడిగా పొందవచ్చు.