
అసలు వర్షకాలంలో చర్మం మరింత జిడ్డుగా మారడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. మన చర్మంలో ఉండే సెబమ్ ఉత్పత్తి సమతుల్యత తప్పినప్పుడు ముఖంపై ఎక్కువ ఆయిల్ వస్తుంది. వర్షాకాలంలో ఉండే ఉక్కపోత, హ్యుమిడిటీ వల్ల సెబమ్ ఉత్పత్తి చేసే సెబేషియస్ గ్రంథులు మరింత యాక్టివ్ అవుతాయి. అందుకే ఫేస్ మరింత జిడ్డుగా మారుతుందని నిపుణులు అంటున్నారు. అయితే ఇంట్లో దొరికే కొన్ని సహజ పదార్థాలతో మనం ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు.

ముల్తానీ మట్టి: ఎన్నో ఏళ్లుగా ఆయుర్వేదంలో ఈ ముల్తానీ మట్టిని చర్మ సౌందర్యానికి వాడుతున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ముల్తానీ మట్టి చర్మంపై ఉండే అదనపు జిడ్డును పీల్చుకోవడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ఇందుకోసం మీరు ముల్తానీ మట్టిలో కొద్దిగా రోజ్ వాటర్ మిక్స్ చేసి పేస్ట్‌లా తయారు చేయండి. తర్వాత దాన్ని ఫేస్‌కు అప్లై చేసి ఆరిన కాసేపటి తర్వాత కడిగేయండి. ఇలా చేయడం ద్వారా మీ ముఖంపై ఉన్న జడ్డు మొత్తం క్షణాల్లో మాయమవుతుంది.

చందనం పొడి: జిడ్డు చర్మ సంరక్షణకు చందనం పొడి చాలా బాగా సహాయపడుతుంది. ఇది చర్మానికి చలువ చేయడంతో పాటు గ్లో ఇస్తుంది. ఇందుకోసం మీరు చందనం పొడిలో రెండు చెంచాల పచ్చి పాలు వేసి దాన్ని పేస్ట్‌లా తయారు చేసుకోండి. ఈ పేస్ట్‌ను ముఖానికి రాసుకుని, 10 నిమిషాల తర్వాత మామూలు నీటితో కడిగేసుకోండి. దీనివల్ల చర్మానికి సహజమైన మెరుపు వస్తుంది.

శనగపిండి చిట్కా: శనగపిండికి చర్మంలోని నూనెను సహజంగా పీల్చుకునే గుణం ఉంది. ఇది జిడ్డును నియంత్రించడమే కాకుండా నల్లటి మచ్చలను కూడా తగ్గిస్తుంది. కాబట్టి ఒక గిన్నెలో మూడు చెంచాల శనగపిండి, ఒక చిటికెడు పసుపు ,మూడు చెంచాల పెరుగు కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌లా వేసుకుని ఆరిన తర్వాత శుభ్రం కడుక్కొండి. అంతే క్షణాల్లో మీ ముఖంపై ఉన్న జిడ్డు తొలగిపోయి మీ ఫేస్ ప్రకాశవంతంగా మెరుస్తుంది.

అలోవెరా: కలబందను ఆల్‌రౌండర్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇది చర్మానికి, జుట్టుకు, ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను చేకూరుస్తుంది. కాబట్టి ఉదయం స్నానం చేయడానికి 10 నిమిషాల ముందు అలోవెరా జెల్‌ను ముఖానికి రాసుకోండి. అది ఆరిపోయిన తర్వాత సాధారణ నీటితో కడిగేయండి. ఇందులో ఉండే మాయిశ్చరైజింగ్ గుణాలు చర్మాన్ని లోపలి నుండి రిపేర్ చేయడానికి సహాయపడతాయి.