
చేతులు మార్చండి: మనకు తెలియకుండానే పళ్లపై ఎక్కువ బలాన్ని ప్రయోగించడాన్ని నివారించడానికి వైద్యులు ఒక ఆసక్తికరమైన చిట్కాను సూచిస్తున్నారు. మీరు కుడి చేతి వాటం వారైతే ఎడమ చేతితో, ఎడమ చేతి వాటం వారైతే కుడి చేతితో బ్రష్ చేయడం అలవాటు చేసుకోండి. దీనివల్ల సహజంగానే పళ్లపై పడే ఒత్తిడి తగ్గుతుంది. అలాగే బ్రష్ హ్యాండిల్‌ను గుప్పిట పట్టి పట్టుకోకుండా.. కేవలం మూడు వేళ్లతో మాత్రమే పట్టుకుని బ్రష్ చేయడం వల్ల చిగుళ్లకు ఎలాంటి గాయాలు కాకుండా దంతాలను సురక్షితంగా శుభ్రం చేసుకోవచ్చు.

బ్రష్ ఎంపిక: మార్కెట్లో దొరికే ఏ బ్రష్ పడితే అది వాడటం దంత ఆరోగ్యానికి మంచిది కాదు. ఎల్లప్పుడూ మెత్తటి బ్రిస్టల్స్ కలిగిన సాఫ్ట్ లేదా ఫ్లెక్సిబుల్ టూత్ బ్రష్‌లను మాత్రమే ఎంచుకోవాలి. ఇవి పళ్ల సందుల్లోకి సులువుగా దూసుకెళ్లి వ్యర్థాలను తొలగిస్తాయి. ఒకవేళ మీరు ఎంత బలం ఉపయోగిస్తున్నారో మీకు అర్థం కాకపోతే, ప్రెజర్ సెన్సార్ ఉండే ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ ఉపయోగించడం మంచి ప్రత్యామ్నాయం. ఇది పళ్ళపై ఒత్తిడి ఎక్కువైనప్పుడు హెచ్చరిస్తూ దంతాలను కాపాడుతుంది.

దంతాలు సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు రెండుసార్లు బ్రష్ చేయడం తప్పనిసరి. బ్రష్ చేసేటప్పుడు టూత్ బ్రష్‌ను దంతాలకు 45 డిగ్రీల కోణంలో ఉంచాలి. చిగుళ్ల పైభాగం నుండి కిందికి మెల్లగా వృత్తాకారంలో కదిలిస్తూ తోమాలి. అంతేకాకుండా పళ్ల లోపలి భాగాలను కూడా మర్చిపోకుండా శుభ్రం చేయాలి. ఈ ప్రక్రియ మొత్తాన్ని కనీసం 2 నిమిషాల పాటు ఓపికగా చేయాలే తప్ప, ఏదో చుట్టేసాం అన్నట్లుగా ముగించకూడదు.

తిన్న వెంటనే చేయొద్దు: ఆహారం లేదా టిఫిన్ తిన్న వెంటనే బ్రష్ చేసే అలవాటు చాలామందికి ఉంటుంది. కానీ ఏదైనా తిన్న తర్వాత లేదా పండ్ల రసాలు వంటి ఆమ్ల గుణాలున్న పదార్థాలు తాగిన తర్వాత నోటిలో యాసిడ్స్ ఉత్పత్తి అవుతాయి. ఆ సమయంలో ఎనామిల్ చాలా బలహీనంగా ఉంటుంది. కాబట్టి తిన్న వెంటనే బ్రష్ చేస్తే ఎనామిల్ అరిగిపోతుంది. అందుకే ఆహారం తిన్న తర్వాత కనీసం 30 నిమిషాల పాటు ఆగి.. ఆపై పుష్కలంగా నీరు తాగి లేదా బ్రష్ చేయడం మంచిదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

ఫ్లోరైడ్ రక్షణ పోకూడదంటే: ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తినడానికి ముందే పళ్లు తోముకోవడం అత్యంత ఉత్తమమైన పద్ధతి. అయితే బ్రష్ చేసుకున్న వెంటనే నోట్లో నీళ్లు పోసుకుని అతిగా పుక్కిలించి ఊసేయకూడదు. టూత్‌పేస్ట్‌లో ఉండే ఫ్లోరైడ్ దంతాలకు ఒక రక్షణ కవచంలా పనిచేసి పుచ్చిపోకుండా కాపాడుతుంది. బ్రష్ చేసిన వెంటనే ఎక్కువగా పుక్కిలిస్తే ఆ ఫ్లోరైడ్ కొట్టుకుపోతుంది. కాబట్టి కేవలం నురగను ఉమ్మేసి, తేలికగా నోరు కడుక్కుంటే సరిపోతుంది. ఈ చిన్న చిన్న మార్పులతో మీ నవ్వును మరింత అందంగా, ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.