
చికెన్ అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు. సండె వచ్చిందంటే చాలూ అందరూ చికెన్ షాప్‌లకు క్యూ కడతారు. అలాంటి వారి కోసం ఇప్పుడో సరికొత్త చికెన్ డిష్ తీసుకొచ్చాం. అదే పాలక్ గ్రీన్ చికెన్ 65 దీన్ని ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన పదార్థాలు చూసుకుంటే? చికెన్: 1 కేజీ, పాలకూర: ఒక కట్ట ,అల్లం, వెల్లుల్లి రెబ్బలు: 5-6 ,కొత్తిమీర: ఒక గుప్పెడు, పుదీనా: ఒక గుప్పెడు, పచ్చిమిర్చి: 10 , చిక్కటి పెరుగు: 1 కప్పు, ఉప్పు: రుచికి తగినంత , కారం: ముప్పావు టీస్పూన్ , గరం మసాలా: అర టీస్పూన్, మొక్కజొన్న పిండి : 2 స్పూన్లు , వంట నూనె: డీప్ ఫ్రైకి సరిపడా, కరివేపాకు: రెండు రెబ్బలు

తయారుచేసే విధానం: ఇంట్లో గ్రీన్ చికెన్ చేసుకోవడానికి ముందుగా ఒక పాత్రలో అర కప్పు నీళ్లు పోసి వేడి చేయండి. నీళ్లు మరుగుతున్నప్పుడు శుభ్రం చేసిన పాలకూర వేసి 8 నిమిషాల పాటు ఉడికించండి. ఆ తర్వాత నీటిని వడకట్టి పాలకూరను చల్లారనివ్వండి.మిక్సీ జార్‌లో ఉడికించిన పాలకూర, అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, చిక్కటి పెరుగు వేసి నీళ్లు కలపకుండా మెత్తని పేస్ట్‌లా గ్రైండ్ చేయండి.

ఇప్పుడు శుభ్రం చేసిన చికెన్ ముక్కలను ఒక పెద్ద గిన్నెలోకి తీసుకోండి. అందులో రుచికి సరిపడా ఉప్పు, కారం, గరం మసాలా వేసి ముక్కలకు బాగా పట్టించండి. ఆ తర్వాత సిద్ధం చేసుకున్న గ్రీన్ పేస్ట్‌ను కూడా వేసి బాగా కలపండి. చివరిగా కార్న్ ఫ్లోర్ పిండి వేసి, ఆ మిశ్రమం అంతా చికెన్ ముక్కలకు పట్టేలా కలిపి, కనీసం అరగంట పాటు పక్కన పెట్టండి. ఇలా చేయడం వల్ల చికెన్ జ్యూసీగా తయారవుతుంది.

అరగంట తర్వాత, స్టవ్ వెలిగించి బాండీ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోయండి. నూనె బాగా వేడెక్కిన తర్వాత, మ్యారినేట్ చేసిన చికెన్ ముక్కలను విడివిడిగా నూనెలో వేయండి. వేయించేప్పుడు మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి ముక్కలను సమానంగా ఉడకనివ్వండి. ముక్కలు వేగుతున్నప్పుడు కరివేపాకు వేస్తే మంచి సువాసన వస్తుంది.

ఇక చికెన్ ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కర్రీని ఒక ప్లేట్‌లోకి సర్వ్ చేసుకోండి. అవసరమైతే దానిపై కొత్తిమీరను చల్లుకోండి. అంతే ఎంతో రుచికరమైన పాలక్ గ్రీన్ చికెన్ 65 రెడీ అయినట్టే. దీనిపై కొంచెం నిమ్మరసం పిండుకుని, ఉల్లిపాయ ముక్కలతో తింటే రుచి అద్భుతంగా ఉంటుంది. పిల్లల నుండి పెద్దల వరకు అందరూ దీన్ని ఇష్టంగా తింటారు. కాబట్టి ఆలస్యం చేయకుండా వెంటనే ట్రై చేయండి