
మందార మొక్కకు తేలికైన, సారవంతమైన, నీరు నిలవని నేల అంటే ఇష్టం. నేల మరీ గట్టిగా ఉన్నా లేదా pH సమతుల్యంగా లేకపోయినా, అది మొక్క పెరుగుదల, పూత రెండింటినీ ప్రభావితం చేస్తుంది. నేలకు కంపోస్ట్, ఇసుక, వేప పిండి, ఎండిన ఆకుల కంపోస్ట్ కలపడం ప్రయోజనకరం.

ఈ మొక్కకు ప్రతిరోజూ కనీసం 5–6 గంటల ప్రత్యక్ష సూర్యరశ్మి అవసరం. తగినంత సూర్యరశ్మి లేకపోతే, మొక్క ఆకులు పెరిగినా పువ్వులు తక్కువగా పూస్తాయి. అందువల్ల, ఉదయం పూట మంచి సూర్యరశ్మి పడే ప్రదేశంలో దీనిని ఉంచండి. వర్షాకాలంలో కుండీలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోండి, ఎందుకంటే మట్టి నిరంతరం తడిగా ఉండటం వల్ల వేర్లు కుళ్ళిపోతాయి.

ఎరువుల సమతుల్యత కూడా చాలా ముఖ్యం. నత్రజని అధికంగా ఉంటే మొక్క పచ్చగా పెరుగుతుంది. కానీ, పూలు పూయవు. పూల ఉత్పత్తిని పెంచడానికి, పొటాషియం, ఫాస్ఫరస్ అధికంగా ఉండే ఎరువును వాడండి. అరటి తొక్కల ఎరువు, కట్టెల బూడిద అందిస్తే మొగ్గులు పెద్దగా, రంగులమయంగా వికసిస్తాయి.

మందార మొక్కకు అరటి తొక్కల ద్రవ ఎరువు చాలా ప్రభావవంతమైన ఇంటి చికిత్సగా పనిచేస్తుంది. 4-5 అరటి తొక్కలను చిన్న ముక్కలుగా కోసి, వాటిని 1 లీటరు నీటిలో రెండు రోజుల పాటు నానబెట్టండి. ఆ నీటిని వడకట్టి, మరో 2 లీటర్ల నీటిని కలపండి. ఈ ద్రావణాన్ని ప్రతి 15 రోజులకు ఒకసారి మొక్క వేర్లకు పట్టించండి. ఇది మొక్కకు పొటాషియంను అందించి, ఎక్కువ పూలు పూయడానికి ప్రోత్సహిస్తుంది.

వర్షాల సమయంలో మందార మొక్కలను ఎక్కువగా వేధించేది మీలీబగ్స్ నల్ల పేనుబంక. వీటి నివారణకు వారానికి లేదా పది రోజులకు ఒకసారి సాయంత్రం వేళల్లో వేపనూనె స్ప్రింకిల్ చేయాలి. కుండీలో నిరంతరం వర్షపు నీరు పడటం వల్ల పైమట్టి గట్టిపడుతుంది.

వారానికి ఒకసారి చిన్న పరికరంతో పైమట్టిని తేలికగా తవ్వి లూజ్ చేయడం ద్వారా మట్టిలోకి గాలి, నీరు వేళ్లకు సరిగ్గా అంది మొక్క చురుగ్గా ఎదుగుతుంది. అలాగే, ఎప్పటికప్పుడు ఎండిన ఆకులను, పాత కొమ్మలను కత్తిరించండి. ఇది కొత్త చిగుళ్ళు పెరగడానికి, పూలు పూసే అవకాశాన్ని పెంచుతుంది. కత్తిరించడానికి వర్షాకాలం మంచి సమయం. దీనివల్ల కత్తిరించిన కొమ్మల మరో కుండీలలో నాటుకొవచ్చు.