
ఎటువంటి కృత్రిమ రంగులు వాడకుండా, కమ్మటి బెల్లం మరియు నెయ్యితో తయారు చేసే ఈ గుమ్మడికాయ హల్వా పిల్లల నుంచి పెద్దల వరకు అందరి ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరం. ఒక్కసారి చేసి పెట్టుకుంటే వారం రోజుల పాటు ఫ్రిజ్‌లో నిల్వ ఉంటుంది.

ఈ గుమ్మడికాయ హల్వా తయారీకి ముందుగా ఒక కేజీ పసుపు గుమ్మడికాయను తీసుకుని, శుభ్రంగా కడిగి పై పొట్టును చాకుతో తొలగించాలి. ఆ తర్వాత గ్రేటర్‌తో గుమ్మడికాయను సన్నగా తురుముకోవాలి. ఆరు కప్పుల గుమ్మడి తురుమును పక్కన పెట్టుకోవాలి.

స్టవ్ మీద బాండీ పెట్టి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేడిచేసి జీడిపప్పు, బాదం పప్పు పలుకులను వేయించి పక్కన తీసుకోవాలి. అదే నేతిలో ఆరు కప్పుల గుమ్మడి తురుము వేసి మంటను హై ఫ్లేమ్‌లో ఉంచి 4-5 నిమిషాలు వేయించాలి. ఇలా వేయించడం వల్ల గుమ్మడిలోని పచ్చివాసన, ఒగరు తగ్గిపోతాయి.

తురుము కొద్దిగా మగ్గాక రెండున్నర కప్పుల బెల్లం తురుము వేసి బాగా కలపాలి. బెల్లం కరిగి పల్చబడుతుంది. హై ఫ్లేమ్‌పై నీరంతా ఇంకిపోయే వరకు ఉడికిస్తూ, మధ్యమధ్యలో 3 టేబుల్ స్పూన్ల నెయ్యిని కొద్దికొద్దిగా వేస్తూ కలుపుకోవాలి.

హల్వా బాగా దగ్గరపడి నీరంతా ఇంకిపోయాక అర టీస్పూన్ యాలకుల పొడి, చిటికెడు ఉప్పు వేసి బాగా కలపాలి. చివరిగా వేయించిన జీడిపప్పు, బాదం పప్పు వేసి బాగా కలిపి దింపేస్తే కమ్మటి గుమ్మడికాయ హల్వా సిద్ధమవుతుంది.