
కావలసిన పదార్థాలు: 1 కప్పు పచ్చ పెసలు, 1 మీడియం సైజు టమాటా, 2½ కప్పులు నీళ్లు , పావు స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 3 టేబుల్ స్పూన్ల వంట నూనె, హోల్ గరం మసాలా దినుసులు – లవంగం, దాల్చిన చెక్క, ఇలాచి, బిర్యానీ ఆకు, పావు స్పూన్ జీలకర్ర, సన్నగా తరిగిన 1 పెద్ద ఉల్లిపాయ , 1 స్పూన్ అల్లం-వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ కారం పొడి, అర స్పూన్ ధనియాల పొడి, పావు స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ బటర్ లేదా ఫ్రెష్ క్రీమ్ లేదా 2 స్పూన్ల పెరుగు, కొద్దిగా తాజా కొత్తిమీర తరుగు

తయారీ విధానం: రాళ్లు లేకుండా శుభ్రం చేసుకున్న 1 కప్పు పచ్చ పెసలను ఒక పాన్‌లో వేయాలి. మీడియం ఫ్లేమ్‌పై మాడిపోకుండా మంచి రంగు, కమ్మటి సువాసన వచ్చే వరకు దోరగా వేయించి ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ పెసర్లను కుక్కర్లో వేసి.. చిన్నగా తరిగిన 1 టమాటా ముక్కలు, పావు స్పూన్ పసుపు, పావు స్పూన్ ఉప్పు, మరియు రెండున్నర కప్పుల నీళ్లు పోయాలి. కుక్కర్ మూతపెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు మీడియం మంటపై ఉడికించాలి.

స్టవ్‌పై కడాయి పెట్టి 3 స్పూన్ల నూనె వేడిచేయాలి. నూనె కాగిన తర్వాత హోల్ గరం మసాలా దినుసులు, పావు స్పూన్ జీలకర్ర వేసి చిటపటలాడనివ్వాలి. ఆ తర్వాత సన్నగా తరిగిన పెద్ద ఉల్లిపాయ ముక్కలు వేసి మూతపెట్టాలి. ఉల్లిపాయ ముక్కలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మీడియం-హై ఫ్లేమ్‌పై బాగా వేయించాలి. ఆపై 1 స్పూన్ అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేలా నూనెలో వేయించి, ఫ్లేవర్ దిగాక బిర్యానీ ఆకును తీసి పక్కన పడేయవచ్చు.

నూనెలో వేగిన ఉల్లిపాయలకు 1 స్పూన్ కారం, అర స్పూన్ ధనియాల పొడి, పావు స్పూన్ జీలకర్ర పొడి, మరియు రుచికి సరిపడా ఉప్పు వేసి లో ఫ్లేమ్‌పై కలపాలి. మసాలాలు వేగిన తర్వాత 1 స్పూన్ వెన్న లేదా క్రీమ్/పెరుగు వేసి అంతా బాగా మిక్స్ అయ్యేలా కలపాలి.

ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న పెసలు-టమాటా మిశ్రమాన్ని నీటితో సహా వేసి కలపాలి. గ్రేవీ చిక్కదనాన్ని బట్టి మరికొన్ని నీళ్లు పోసి మూతపెట్టి మీడియం మంటపై కూర దగ్గరపడి నూనె పైకి తేలే వరకు 4-5 నిమిషాలు ఉడికించాలి. చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే, నోరూరించే ధాబా స్టైల్ 'పెసల మసాలా కర్రీ' సిద్ధం! వేడివేడి చపాతీలు, పుల్కాలు లేదా జీరా రైస్‌తో తింటుంటే మళ్లీ మళ్లీ చేసుకోవాలనిపించే అద్భుతమైన రుచితో తృప్తినిస్తుంది!