
కావలసిన పదార్థాలు: రాత్రంతా నానబెట్టిన అర కప్పు సజ్జలు, కడిగి నానబెట్టిన అర కప్పు పెసరపప్పు, 1 కప్పు నిండుగా కూరగాయల ముక్కలు, 1 మీడియం సైజు ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, 1 టీస్పూన్ తాజా అల్లం-వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర – అర టీస్పూన్, 1 బిర్యానీ ఆకు, 3 నుండి 4 చిటికెల ఇంగువ, 2 నుండి 3 రెమ్మల కరివేపాకు, అర టీస్పూన్ ధనియాల పొడి, పావు టీస్పూన్ గరం మసాలా పొడి, పావు టీస్పూన్లో సగం పసుపు, తగినంత కారం, అర టీస్పూన్ సాల్ట్, 3 కప్పుల నీళ్లు, 2 టేబుల్ స్పూన్ల వంట నూనె, కొద్దిగా నెయ్యి, కొద్దిగా తాజా కొత్తిమీర తరుగు

తయారీ విధానం: అర కప్పు సజ్జలను నీటిలో శుభ్రంగా కడిగి కనీసం 8 గంటలు లేదా రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే నీటిని పూర్తిగా వడకట్టి.. మిక్సీ జార్లో నీళ్లు లేకుండా వేసి పల్స్ మోడ్‌లో ఆపుతూ కొద్దిగా రవ్వ రవ్వగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే అర కప్పు పెసరపప్పును కూడా శుభ్రంగా కడిగి నీళ్లు పోసి పక్కన ఉంచుకోవాలి. స్టవ్‌పై అడుగు మందంగా ఉండే కుక్కర్ లేదా పాత్ర పెట్టి 2 టేబుల్ స్పూన్ల నూనె వేడిచేయాలి. నూనె కాగిన తర్వాత అర టీస్పూన్ జీలకర్ర, 1 బిర్యానీ ఆకు వేసి వేయించాలి. ఆ తర్వాత తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, 3-4 చిటికెల ఇంగువ వేసి ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్గా మారే వరకు వేపాలి.

ఇప్పుడు 1 టీస్పూన్ అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేలా వేయించి.. తరిగిన పచ్చిమిర్చి, క్యారెట్, బఠాణీ, బంగాళాదుంప, టమాటా ముక్కలు వేసి కలపాలి. ఇందులోనే అర టీస్పూన్ ధనియాల పొడి, పావు టీస్పూన్ గరం మసాలా, సరిపడా ఉప్పు, కారం, పసుపు వేసి కూరగాయలను 2 నిమిషాలు వేయించాలి. కూరగాయలు వేగిన తర్వాత మిక్సీ పట్టిన సజ్జ రవ్వను, నీరు వంపేసిన పెసరపప్పును వేయాలి. అడుగు పట్టకుండా గరిటెతో అన్నింటినీ వేగంగా బాగా కలుపుకోవాలి.

ఇప్పుడు సరిగ్గా 3 కప్పుల నీళ్లు పోసి బాగా కలపాలి. మంటను లో-మీడియం ఫ్లేమ్‌లో ఉంచి మధ్యమధ్యలో అడుగు అంటకుండా కలుపుతూ ఉడికించాలి. కిచిడీ కాస్త దగ్గరపడిన తర్వాత.. కుక్కర్ మూతను సాధారణంగా పైన పెట్టి (విజిల్ పెట్టకూడదు), మంటను పూర్తిగా లో ఫ్లేమ్‌కి తగ్గించి ఉడికించాలి. సజ్జ రవ్వను చేత్తో నొక్కి చూస్తే మెత్తగా మారినప్పుడు ఉడికినట్లు లెక్క ఒకవేళ రవ్వ గట్టిగా ఉంటే కొద్దిగా మరిగే వేడి నీళ్లు పోసి కలపాలి.

ఉడికిన తర్వాత తరిగిన కొత్తిమీర చల్లుకోవాలి. చివర్లో 1 టీస్పూన్ నేతిలో వేయించిన జీడిపప్పులను కిచిడీపై వేసి కలపాలి. డైట్లో ఉన్నవారు నెయ్యి, జీడిపప్పు వేయకుండా తీసుకోవచ్చు. కిచిడీ చల్లారాక చిక్కబడుతుంది కాబట్టి కాస్త జారుగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే, నోరూరించే శీతాకాలపు ప్రత్యేక 'సజ్జల మసాలా కిచిడీ' సిద్ధం! వేడివేడిగా తింటుంటే చలికాలంలో శరీరానికి హాయిగా ఉంటూ, బ్రేక్‌ఫాస్ట్, లంచ్ లేదా డిన్నర్‌కు పరిపూర్ణ పోషకాలను అందిస్తుంది!