
ఈ కారం పొడి తయారీకి మునగాకును ఎంచుకునేటప్పుడు మరీ లేతగా ఉన్నది కాకుండా, మరీ ముదిరిపోయినది కాకుండా మధ్యస్థంగా ఉన్న ఆకులను సేకరించాలి. ఆకులను కాడల నుండి వేరు చేసి, నీటిలో మూడు, నాలుగు సార్లు శుభ్రంగా కడగాలి. ఆకుల్లో ఇసుక లేదా దుమ్ము ఏమీ లేకుండా చూసుకోవాలి. కడిగిన మునగాకును ఒక కాటన్ గుడ్డపై పరుచుకుని, తడి అంతా పూర్తిగా ఆరిపోయే వరకు నీడలోనే ఆరబెట్టుకోవాలి.

ఆకుల్లో ఏమాత్రం తడి ఉన్నా కారం పొడి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు కాబట్టి, ఆకులు పూర్తిగా పొడిగా మారేలా చూసుకోవడం చాలా ముఖ్యం. ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకుని, రెండు టేబుల్ స్పూన్ల నూనె వేయాలి. ఇందులో ఒక కప్పు వేరుశనగ పప్పు (పల్లీలు), ఒక టేబుల్ స్పూన్ మినపగుళ్లు, ఒక జానెడు పరిమాణంలో అల్లం ముక్కలను వేసి లో ఫ్లేమ్ లో మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు నిదానంగా వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి.

అదే బాండీలో నిమ్మకాయ సైజు అంత చింతపండును చిన్న ముక్కలుగా చేసి తడి లేకుండా వేయించాలి. ఆ తర్వాత పావు కప్పు ధనియాలు, తగినన్ని ఎండుమిర్చి, ఒక టీస్పూన్ ఆవాలు వేసి వేయించాలి. చివరగా అర టీస్పూన్ జీలకర్ర కూడా వేసి మంచి సువాసన వచ్చే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి.

కారం పొడి తయారీ విధానం ఇప్పుడు అదే బాండీలో పూర్తిగా ఆరిపోయిన మునగాకును వేసి మీడియం ఫ్లేమ్ లో నిదానంగా వేయించాలి. ఆకు అంతా డ్రైగా మారి, క్రిస్పీగా అయ్యే వరకు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత, మొదట వేయించిన పప్పులు, మసాలాలు, చింతపండు మరియు తగినంత ఉప్పు వేసి మిక్సీ జార్ లో కాస్త బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత వేయించిన మునగాకును, కొన్ని వెల్లుల్లి రెబ్బలను కూడా వేసి మరీ మెత్తటి పౌడర్ లా కాకుండా కాస్త బరకగా మిక్సీ పట్టుకోవాలి.

చివరగా ఈ పొడిని ఒక వెడల్పాటి ప్లేట్ లో వేసి బాగా కలుపుకుని, పూర్తిగా చల్లారిన తర్వాత గాజు సీసాలో భద్రపరుచుకుంటే ఆరు నెలల పాటు అస్సలు పాడవదు. వేడివేడి ఇడ్లీలు, క్రిస్పీ దోశలు లేదా వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని ఈ మునగాకు కారం పొడితో తింటే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం మీ సొంతమవుతాయి.